ఉడతను కారణంగా చూపడం విమర్శలకు తావిస్తోంది. విద్యుత్ లైన్‌పై ఉడత సంచరిస్తూ, మరో లైన్‌ను తాకినందుకే (క్రాసారం) వైరు తెగిందని సీఎండీ వెల్లడించారు. హైటెన్షన్ వైర్లను ఉడుతలు కొరుకుతాయా? సరే కొరికాయే అనుకుందాం.. అవి తెగిపోతాయా ? హైటెన్షన్ వైర్లు తెగిపోయేంతగా ఉడుతలు కొరికేయగలవా ? అంత బలహీనంగా హైటెన్షన్ వైర్లు ఉంటాయా ? ఇవన్నీ ఇప్పుడు ఏపీ ప్రజలకు వస్తున్న అనుమానాలు. ఎందుకంటే శ్రీసత్యసాయి జిల్లాలో రోడ్డుపై ఆటోలో కూలిపనికి వెళ్తున్న వారిపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి.ఈ కారణంగా ఆరుగురు మహిళా కూలీలు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇప్పుడు ఈ ప్రమాదానికి అధికారులు చెబుతున్న కారణం మరింత హైలెట్ అవుతోంది. హైటెన్షన్ వైర్లను ఉడుతలు కొరికేయడం వల్ల తెగిపోయాయని అందువల్లే అవి తెగి ఆటోపై పడ్డాయని ఇందులో ఎలాంటి సిబ్బంది నిర్లక్ష్యం లేదని కరెంట్ అధికారులు ప్రకటించేశారు.
ఉడత ఊపులకే విద్యుత్ వైరు తెగిందంటే నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు పాటించారో అర్థమవుతోందని పలువురు పెదవి విరుస్తున్నారు. హెచ్‌వీడీఎ్‌స పథకం పైలెట్ ప్రాజెక్టు కింద తాడిమర్రి మండలంలో విద్యుత్ ఆధునికీకరణ పనులు చేశారు. ఇందులో భాగంగా ఆ మండలంలోని దాడితోట సబ్‌స్టేషన్ పరిధిలోని చిల్లకొండయ్యపల్లి ఫీడర్ కింద రెండునెలల కిందట లైన్ ఆధునికీకరణ చేశారు. ఈ పనులు అధికార పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టర్, తమిళనాడుకు చెందిన ఓ సబ్ కాంట్రాక్టర్‌తో చేయించారని తెలిసింది. ఆ సమయంలో నాసిరకం విద్యుత్ వైర్లను కాంట్రాక్టర్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో.. ఒక చిన్న ఉడత తాకితే వైరు ఎలా తెగుతుందని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదా.. అని ప్రమాద బాధిత కుటుంబాలవారు ప్రశ్నిస్తున్నారు. కాగా, ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విద్యుత్‌శాఖ అనంతపురం సూపరింటెండెంట్‌ను ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశించారు. మృతులకు రూ.ఐదు లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.రెండు లక్షలు చొప్పున పరిహారం ప్రకటించి, సీఎండీ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.