‘మానవ సేవ కోసం సకల ప్రాణుల సేవ’ అన్న సూత్రంతో ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు. నేల, గాలి, వాతావరణం, చెట్లను కాపాడుకోవాలని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గంట్యాడలో నిర్మించిన సువ్రత గోవుల ఆశ్రమాన్ని(గోశాల) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా గోశాల ఏర్పాటుచేశామని, దీనిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలన్నారు. గోసంరక్షణ, స్త్రీ ఆరోగ్యంతోనే జాతికి, సమాజానికి, కుటుంబానికి మేలు జరుగుతుందన్నారు, వందల మందికి భగవద్గీతను ఉచితంగా బోధిస్తున్న అంధుడు, దళితుడైన గణేష్ సంఘసంస్కర్త అని చినజీయర్‌స్వామి కొనియాడారు. ఆయన ఇంటి నిర్మాణం కోసం రూ.2లక్షలు అందించి, నిర్మాణాన్ని ప్రారంభించారు. గీతాపారాయణంలో ప్రతిభ చూపుతున్న మరో దళిత విద్యార్థి ఇంటికి చినజీయర్‌స్వామి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అంబేడ్కర్ దళిత సంఘం ప్రతినిధులు ఆయనకు అంబేడ్కర్ విగ్రహాన్ని అందజేశారు.
గురుదేవ చారిటబుల్ ట్రస్టుకు రూ. 10లక్షల విరాళం అందజేత
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని మంగళపాలెం గ్రామంలోని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్టును చిన్న జీయర్ స్వామి సందర్శించారు. ట్రస్టు ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గురువును, దైవాన్ని మర్చిపోకూడదని సూచించారు. వారిరువురిని గుర్తుంచుకుంటే సుఖ సంతోషాలతో జీవితం నడుస్తుందని బోధించారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబును, ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను జీయర్ స్వామి కొనియాడారు. మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి అధునాతన వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ట్రస్టుకు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి 10 లక్షల విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు.పెద్ద ఎత్తున భక్తులు హాజరై జీయర్ స్వామిని దర్శించుకున్నారు.