తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఇవాళ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టనున్న నిరసనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మందడం గ్రామం నుంచి అసెంబ్లీ వరకూ ఎడ్ల బళ్లపై ర్యాలీగా వెళ్లాలని తెదేపా నేతలు నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు ముందస్తుగా పలువురు నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్న ఎడ్ల బండ్లను తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎండ్లను పోలీస్‌స్టేషన్ నుంచి దూరంగా తరలించి టైర్లలోని గాలి తీసేశారు. ఈ ఘటన మీద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడ్లను అరెస్టు చేయడమేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా అసెంబ్లీ పరిసరాల బయట ఉద్రిక్తత నెలకొంది. ఎడ్లబండి కాడె మోస్తూ అసెంబ్లీకి లోకేష్ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, ఇతర ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పోలీసు వలయాన్ని తోసుకుంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ ఎడ్ల బండిని లాక్కుంటూ టీడీపీ నేతలు వెళ్లారు.
పోలీస్ స్టేషన్ నుంచి ఎడ్ల బళ్లను తీసుకుంటూ రోడ్డుపైకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకువచ్చారు. ఎడ్లకు బదులు టీడీపీ ఎమ్మెల్యేలే కాడి తగిలించుకుని బండిని లాగారు. ఎడ్ల బళ్లపై పోలీసు ప్రతాపం ఏమిటంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కోటరీ వల్లే రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. మూడేళ్లుగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వాపోయారు. మూగజీవాల్ని పోలీసులు తరమటం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. పశువుల పట్ల కూడా ప్రభుత్వానికి కనికరం లేదని నేతలు అసహనం వ్యక్తంచేశారు.రైతు ద్రోహి జగన్ అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రైతు సమస్యల పట్ల నిరసనను కూడా అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
రైతు ద్రోహి జగన్ అంటూ అసెంబ్లీ ముందు నిరసన తెలుపుతున్న టిడిపి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు. https://t.co/pwiYBVJdKq
— Telugu Desam Party (@JaiTDP) September 19, 2022