తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలు అన్ని పనులకీ ఆటంకం కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటనలు కూడా చేస్తున్నారు. తాజాగా నేడు వచ్చే 12 గంటల పాటు హైదరాబాద్ లో బలమైన ఈదురుగాలుల సూచన ఉందని జీహెచ్ఎంసీలోని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. దీంతో మోస్తరు వర్షం కూడా పడుతుందని వెల్లడించింది. రాత్రి 10 గంటల వరకు ఈ గాలులు ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేసినట్లుగా జీహెచ్ఎంసీ తెలిపింది.
గడ్డెన్న వాగు, స్వర్ణ వాగుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 70 శాతం మేరకు నిర్వహిస్తూ అధిక వరదను ఎప్పటికప్పుడు కిందికి వదిలేలా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు.
— Telangana CMO (@TelanganaCMO) July 11, 2022
ఎక్కువ తీవ్రతతో వీచే ఈ గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అందుకే ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. ప్రజలు ఎమర్జెన్సీ సమయాల్లో అవసరమైతేనే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండిపోవాలని విజ్ఞప్తి చేసింది. గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఎవరూ ఉండొద్దని సూచించింది. ఎమర్జెన్సీ సమయాల్లో ప్రతిస్పందించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొంది. ఎవరైనా అత్యవసర సాయం కావాలనుకునే వారు వెంటనే 040-29555500 నెంబర్ కు కాల్ చేయడం ద్వారా సాయం పొందవచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఎక్కడైనా తక్షణ అత్యవసర సాయం అవసరం అయితే 040 – 21111111 నెంబరుకు ఫోన్ చేయాలని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ట్వీట్ చేశారు. ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో.. జన జీవనం స్తంభించింది. హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ముసురు కొనసాగుతోంది. భాగ్యనగరంలో ఏకధాటిగా చిరుజల్లులతో వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరికొన్ని గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ ప్రభావంతో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో.. రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. భారీ వర్షాలతో ఆయా జిల్లాల యంత్రాగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెరడిగొండ మండలం రాజులతాండాకు వెళ్లే మార్గంలో ఉప్పొంగుతున్న వాగును ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో దాటుతున్నారు. దర్బాతండా మార్గంలో వాగు దాటే క్రమంలో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు కొంతదూరం కొట్టుకుపోయి చెట్లకొమ్మల సాయంతో బతికి బయటపడ్డారు. బోథ్ మండలం మర్లపల్లికి వెళ్లే దారిలోనూ ప్రజలు వాగు దాటేందుకు కష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో తుంతుంగా వాగు ప్రవాహంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.