జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రచార ఆర్భాటాలు తప్ప కార్యాచరణలో పూర్తి విఫలం అని చెప్పక తప్పదు. ఏదన్న పథకం ప్రారంభించే రోజు అంత మందికి ఇచ్చాం, ఇంత మందికి ఇచ్చాం, ఇస్తున్నాం అని భారీ ప్రకటనలు, కోట్ల రూపాయిల ఖర్చు పెట్టి సభలు,జనాలను పోగు చేయడానికి బోల్డంత శ్రమ. మళ్ళీ ఆ సభల్లో ప్రతిపక్షాల మీద, జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారి మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దారుణమైన విమర్శలు. ఆచరణలో మాత్రం ఘోరంగా వైఫల్యం.
కర్నూలు జిల్లా ఆదోనిలో జులై 5న జరిగిన విద్యా కానుక ప్రారంభ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ “నిరుడు కంటే ఈ ఏడాది ఎక్కువగా దాదాపు 47 లక్షల మందికి కిట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండగానే పిల్లలు పాఠశాలల్లో అడుగుపెడుతుండగానే విద్యా కానుకను వారి చేతుల్లో పెడుతున్నాం” అన్నారు.స్కూల్స్ ప్రారంభం అయ్యి దాదాపు 40 రోజులు దాటినా ఇప్పటికీ పంపిణీ పూర్తి కాలేదు. జులై 5న పాఠశాలలు తెరుచుకున్నాయి.ఈనెల 25లోగా పంపిణీ పూర్తి చేయాలని ఇటీవల జరిగిన సమీక్షలో మరోసారి సీఎం జగన్ ఆదేశించారు. ఈ గడువులోగా కూడా విద్యార్థులకు అవి అందే పరిస్థితి కనిపించడం లేదు.
ఏకరూప దుస్తులను కుట్టించుకొని,వాటిని ధరించి వచ్చేందుకు మరో 20 నుండి 30 రోజుల వరకు సమయం పడుతుంది. మూడు జతలకు కుట్టు కూలి ఇవ్వాల్సి ఉండగా,ఇంతవరకు ఆ సొమ్మును తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదు.ఆశ్చర్యం, హాస్యాస్పదం అయిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఈ ఏడాది విద్యాకానుకనే అందించని అధికారులు వచ్చే ఏడాదికి సంబంధించిన విద్యాకానుక సామగ్రి టెండర్లకు చర్యలు చేపట్టడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 47 లక్షల మంది విద్యార్థులకు కిట్లు అందించాల్సి ఉండగా 11.85లక్షలు మందికి ఏకరూప దుస్తులు, 16.59లక్షల మందికి బూట్లు ఇంతవరకు అందలేదు.రాష్ట్ర వ్యాప్తంగా బూట్లు 65%, బ్యాగ్‌లు 75% విద్యార్థులకు అందించారు. ఇంకా 25% మందికి ఇవ్వాల్సి ఉంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యాసంవత్సరం ప్రారంభమై,రెండు నెలలు అవుతున్న విద్యార్థులకు పుస్తకాలు , యూనిఫాం ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 23న విద్యాసంస్థలు బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు …