గెలిచింది ఒక్కడు… ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు కూడా అధికార పార్టీలోకి జంప్ చేశాడు. అఫీషియల్ గా కాకపోయినా.. ఆయన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే. అయినా జనసేన ఆయన మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు. నోటీసు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఓ రేంజులో ప్లాన్ చేస్తున్నారు. ఆపరేషన్ రాపాక అంటూ పెద్ద స్కెచ్ వేసేశారు జనసైనికులు. అసలు రాపాక పార్టీ మారిన మరుక్షణం నుంచి అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు జనసైనికులు. ఎందుకంటే కేవలం జనసేన ఇమేజ్ మీదే ఆయన గెలిచాడు. పోల్ మేనేజ్ మెంట్ వరకు ఆయనేమన్నా భరించాడేమో గాని.. ఇమేజ్ మాత్రం పవన్ కల్యాణ్ దే. అక్కడ కాపులు కూడా అధికం.. వారి ఓటింగ్ కీలకం. అది కూడా పని చేసింది. ఇన్ని వాడుకుని.. చివరకు గెలిచాక.. రోజుల్లోనే వైసీపీకి జై కొట్టాడీ రాపాక వరప్రసాద్.అందుకే అప్పటి నుంచి ఆయనను సస్పెండ్ చేయలేదు. కాని.. ఆచరణలో సస్పెండ్ చేశారు. అంటే ఏ మీటింగుకు రానివ్వలేదు. ఏ కార్యక్రమానికి రానివ్వలేదు. రాజోలు నియోజకవర్గంలో జనసేన శ్రేణులు అంతా తామై ఈ ఎమ్మెల్యేకు పోటీగా వ్యవహారం నడిపించారు. అసలు ప్రజలతో కూడా వారే ఎమ్మెల్యేలుగా పనుల గురించి మాట్లాడుతూ, అధికారులతోనూ ఫాలో అప్ చేస్తూ మొత్తం డామినేట్ చేసేశారు. ఎక్కడైనా జనసేన సభ పెట్టినా.. రాపాక నువ్వు రావొద్దు అంటూ పోస్టర్లు కూడా వేశారు. అలా రాపాక వరప్రసాద్ ని జనసేన శత్రువుగా స్టాంప్ గట్టిగా వేశారు.
ఇప్పుడు మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. రాజకీయం కూడా వేడెక్కింది. పొత్తుల మాటలు కూడా వినపడుతున్నాయి. జగన్ ఆపరేషన్ కుప్పం, ఆపరేషన్ మంగళగిరి అంటుంటే… చంద్రబాబు ఆఫరేషన్ విశాఖ అంటున్నారు. జనసేన మాత్రం ఆపరేషన్ రాపాక అంటోంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి రాపాకను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా చూడాలని ఫిక్స్ అయ్యారంట. దానికి ఏ వ్యూహం అనుసరించాలో కూడా ఫిక్స్ అయిపోయారంట.ఇఫ్పటికైతే రాజోలు టిక్కెట్ రాపాకకు జగన్ ఇస్తారని గ్యారంటీ అయితే లేదు. అయితే ఆయనైతే గట్టిగా ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు అప్పటికే వైసీపీలో ఉండి.. టిక్కెట్ కోసం ప్రయత్నించేవారు ఉండనే ఉన్నారు. వైసీపీలోనే మూడు గ్రూపులున్నాయి. జనసేన మాత్రం అందరూ ఒకతాటిపై ఉండి.. పవన్ కల్యాణ్ ఏ క్యాండేట్ పేరు చెబితే.. ఆ క్యాండేట్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఈసారైనా లోకల్ వాళ్లకు ఇస్తే బెటరని.. బయటివాళ్లను తీసుకొచ్చి… మళ్లీ వాళ్లు నమ్మకద్రోహం చేస్తే ఇంకా కష్టమని అంటున్నారంట. అంతే కాదు.. వీలైతే పవన్ కల్యాణ్ నే పోటీ చేయాలని కూడా అడుగుతున్నారంట.
