మాజీ మంత్రి లోకేష్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కేంద్రీకరించిన మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గంజి చిరంజీవి.. బీసీ నేత. ఆయన సామాజికవర్గం ఓట్లు మంగళగిరిలో అధికం, కీలకం. 2014లో 12 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2019లో అనూహ్యంగా లోకేష్ ఆ నియోజకవర్గం ఎంచుకోవడంత.. పక్కకు జరగాల్సి వచ్చింది. అప్పుడు ఆయనకు మంత్రి పదవి హామీ కూడా లభించింది. అయితే తెలుగుదేశం ఓడిపోవడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో.. గంజి చిరంజీవికి కూడా ఏమీ జరగలేదు. అప్పుడు లోకేష్ ఓటమికి కూడా ఈ సామాజికవర్గం ఓట్లు పడకపోవడమే. తమవాడిని పక్కనపెట్టి బయటి నుంచి లోకేష్ వచ్చారంటూ అప్పట్లో వాళ్లలో ప్రచారం జరిగింది. అదే ఎఫెక్ట్ చూపించింది.
అయితే లోకేష్ పట్టువదలని విక్రమార్కుడిలా మంగళగిరిని వదలటం లేదు. దాదాపు రెగ్యులర్ గా తిరుగుతూ ప్రతి ఏరియాలోను పట్టు సంపాదించారు. ఏమైనా ఈసారి గెలవాలి అన్నట్లుగా సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే అందుకే వైసీపీ ఆపరేషన్ చిరంజీవి కండక్ట్ చేసినట్లు అర్ధమవుతోంది. గంజి చిరంజీవిని పక్కన పెడితేనే వాళ్ల ఓట్లు పడకపోతే.. అతనినే వైసీపీలోకి తీసుకు వస్తే అనే ఆలోచనే ఈ ఆపరేషన్. ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేసేశాడు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలే విచిత్రంగా ఉన్నాయి.
తనను మొదటి నుంచి కమ్మ సామాజికవర్గవారే టార్గెట్ చేశారని.. వారే తనను ఎదగనీయటం లేదని.. తాను బీసీని కాబట్టే తొక్కేశారంటూ మాట్లాడారు. అంటే ఇక్కడే తన వర్గాన్ని టీడీపీకి వ్యతిరేకంగా ప్రిపేర్ చేస్తున్నట్లు అర్ధమైపోతుంది. మరోటి ఏంటంటే లోకేష్ హిందూపురంకు మారుతున్నారని.. అయినా తనకు ఇక్కడ టిక్కెట్ లేకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు.
అయితే లోకేష్ మారడం అనేది ఫేక్. లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేస్తారని టీడీపీ స్పష్టం చేస్తోంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పై వ్యతిరేకత పెరిగిందని.. మరోవైపు లోకేష్ పట్టు పెంచుకుంటున్నారని.. అందుకే గంజి చిరంజీవిని వైసీపీలోకి తీసుకుని.. ఆర్కేను పక్కనపెట్టి.. ఇతనినే పోటీకి పెడతారని.. అలా చేస్తే లోకేష్ ను ఓడించొచ్చని ప్లాన్ చేస్తున్నారని వారంటున్నారు.
అమరావతిని ఆపేయటం.. అభివృద్ధి లేక స్ధలాలు, పొలాలు రేట్లు పడిపోవడం.. వ్యాపారాలు లేకపోవడంతో.. నియోజకవర్గంలో వైసీపీ పట్ల, ఆర్కే పట్ల వ్యతిరేకత బాగానే ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్ చిరంజీవి కూడా టీడీపీకి డ్యామేజింగ్ గానే పని చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. మరి దీనిని లోకేష్ ఎలా కౌంటర్ చేస్తారో చూడాలని చెప్పుకుంటున్నారు.