రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ విజ్ఞాన్ భవన్ లో నిర్వహించనున్న మీడియా సమావేశంలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుంది. ఆయన పదవీకాలం ముగిసేలోపే కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.
ఎన్నిక ప్రక్రియ..
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. వీరంతా కలిసి ఓటు హక్కు ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్యాలెట్ పేపర్లలో తమ మొదటి ఎంపిక (చాయిస్), రెండో ఎంపిక, మూడో ఎంపిక లను టిక్ చేస్తారు. మొదటి ఎంపిక ఓట్లను తొలుత లెక్కిస్తారు. మొదటి ఎంపిక ఓట్లను మెజారిటీ సంఖ్యలో పొందే రాష్ట్రపతి అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. అందులో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోతే.. రెండో, మూడో ఎంపిక ఓట్లను కూడా లెక్కిస్తారు.
ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువ..
ఈ ఎన్నికలో ఎమ్మెల్యేల ఓటు విలువ ఓ విధంగా, ఎంపీల ఓటు విలువ మరో విధంగా ఉంటుంది. 2017 లెక్కల ప్రకారం.. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 4,896 మంది సభ్యులు(ఉభయ సభల ఎంపీలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు) ఉన్నారు. వీరిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు. తొలుత ఒక రాష్ట్ర జనాభాను , ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి. అలా వచ్చే విలువను 1000తో భాగించగా వచ్చేదే.. ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఓటు విలువ. ఈ లెక్కల ప్రకారం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కో తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132. ఒక్కో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159.
మద్దతు కోసం ప్రయత్నాలు
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, కొందరు కేంద్ర మంత్రులు దేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడడం ప్రారంభించారు. గతంలో రాంనాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకునే ముందు అప్పటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీతోపాటు.. రాజ్‌నాథ్‌సింగ్ వివిధ పార్టీల మధ్య రాజకీయ ఏకాభిప్రాయం కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు నేరుగా మోదీ, అమిత్‌షా ఆ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ తదితర పార్టీలను మినహాయించి.. ఇతర పార్టీలను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రయత్నించే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్‌లతో ఇప్పటికే చర్చలు జరిగినట్లు సమాచారం. బిహార్ ముఖ్యమంత్రి నితిశ్‌కుమార్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చర్చించారు. ఎన్‌డీయే అభ్యర్థి ఎన్నికవ్వాలంటే.. ఇప్పుడు ఆ కూటమికి ఉన్న సభ్యుల బలానికి మరో 9 ఓట్ల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. వైసీపీ, బీజేడీతోపాటు కొన్ని చిన్నపార్టీలు సహకరిస్తే.. తమ అభ్యర్థి విజయం సునాయాసమేనని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. నోటిఫికేషన్ విడుదలయ్యాకే.. బీజేపీ తమ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. గతంలోనూ జూన్ 14న నోటిఫికేషన్ రాగా.. 19న రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించారు. ప్రధాని మోదీ తనకు అనుకూలంగా ఉండే సాదాసీదా నేతనే రాష్ట్రపతిగా ఉండాలని భావిస్తారని, అందువల్ల ఈ సారి కూడా అతి సామాన్య వర్గానికి చెందిన నేతకే ఆయన ప్రాధాన్యతనిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈసారి ఆదివాసీ రాష్ట్రపతి వస్తారా ?
ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ వయసు 76 ఏళ్లు. కాబట్టి ఆయనకు మరొకసారి బీజేపీ అవకాశం ఇవ్వకపోవచ్చు. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత కార్డు వాడిన బీజేపీ ఈసారి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందో చూడాలి. ఆదివాసీ సముదాయానికి చెందిన వ్యక్తిని ఈసారి రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది గుజరాత్‌తో పాటు వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో సుమారు 15శాతం, మధ్యప్రదేశ్‌లో 21శాతం, చత్తీస్‌గఢ్‌లో 30శాతం, రాజస్థాన్‌లో 13.5శాతం ఆదివాసీలున్నారు. భారత్‌లోని మొత్తం ఆదివాసీల జనాభాలో సుమారు 40శాతం జనాభా ఈ అయిదు రాష్ట్రాలలోనే నివసిస్తోంది.
వెంకయ్యనాయుడుకి ప్రమోషన్ లభిస్తుందా ?
దక్షిణ భారత్‌లో విస్తరించాలని కూడా బీజేపీ కోరుకుంటోంది. 2008లో తొలిసారి కర్నాటకలో అధికారం చేపట్టినా ఇంత వరకు దక్షిణ భారత్‌లోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చూపలేక పోతోంది. ఒకప్పుడు కేరళ మీద ప్రధానంగా దృష్టి పెట్టిన బీజేపీ, ఇప్పుడు తెలంగాణలో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఏడాది తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ దక్షిణ భారత్‌లోని రాష్ట్రాలకు బీజేపీ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిని చేసే అవకాశాలున్నాయి..