ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గోదావరికి ఈ ఏడాది ముందస్తుగానే వరదలు వచ్చాయని, దీంతో ఈ నెలలోనే 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని తెలిపారు. రేపు ఉదయానికి వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటం కూడా గోదావరిలో వరద ప్రవాహం పెరగడానికి కారణమని అన్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జగన్ చెప్పారు. ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని అన్నారు. కంట్రోల్ రూమ్స్ సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. కూనవరం, చింతూరుల్లో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు… అమలాపురం, వేలూరుపాడు, వీఆర్ పురంలలో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని తెలిపారు. సహాయక శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు బాగుండాలని సీఎం సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు, మంచి ఆహారం అందించాలని చెప్పారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు ఇవ్వాలని… తక్షణ సాయంగా ఈ డబ్బు వారికి ఉపయోగపడుతుందని చెప్పారు. వరదల కారణంగా జరిగే నష్టాలపై రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశించారు.
అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు తెరవండి
లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే శిబిరాలకు తరలించండి, సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలన్నారు. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నారు. బాధితుల పట్ల మానవతాదృక్ఫధంతో మెలగాలి. శిబిరాల నుంచి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రశంసించే విధంగా ఉండాలి. సహాయ శిబిరాల్లో నాణ్యమైన సేవలందించే క్రమంలో ఖర్చుకు వెనుకాడొద్దు అని సూచించారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు వ్యక్తికి అయితే రూ.1000, ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వండి అని అదేశించారు. తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుంది:
పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన సరుకులు నిల్వ ఉంచేలా చూసుకోవాలన్నారు. పారిశుధ్యం బాగుండేలా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కరెంటు సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోండి తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాలి :
శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండండి:
చెరువులు, ఇరిగేషన్కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోండి.. విద్యుత్ సబ్స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోండి అని పిలుపునిచ్చారు. బోట్లు, లైఫ్ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచమన్నారు. అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నాం . సీఎంఓ అధికారులు మీకు అందుబాటులో ఉంటారు అన్నారు. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపండి: కలెక్టర్లకు సీఎం శ్రీ వైయస్.జగన్ నిర్ధేశం చేశారు.