రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏం అభివృద్ది చేసిందని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు ఎం చెబుతారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా తాడేపల్లి ప్యాలస్ గడప దాటని జగన్ రెడ్డి పార్టీ నేతలకు హిత బోధ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక వారు గడప దాటడానికి సాహసించడంలేదని పేర్కొన్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే ఇంత హడావుడి ఎందుకు అని ప్రశ్నించారు. మూడేళ్లయినా అభివృద్ధి జరగలేదని అందుకు ప్రజలే మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపుతారు అని జోస్యం చెప్పారు. సామాజిక న్యాయం పేరుతో మంత్రులంతా కట్ట కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన విహార యాత్ర తుస్సుమందని విమర్శించారు. ఈమేరకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
మూడేళ్లలో ఒక్క డీఎస్సీ ప్రకటించారా ?
అధికారం చేపట్టి మూడేళ్ళయినా జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ప్రకటించలేదని, టీచర్ పోస్టుల కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని అన్నారు. పదవ తరగతి ఫలితాల పాపం జగన్ రెడ్డి సర్కారుదేనని ఆరోపించారు. మీ చేతకాని తనం వలన పరీక్షలు తప్పిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ప్రభుత్వం చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ఇంకా ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయడంలేదని శైలజనాథ్ ప్రశ్నించారు పిల్లల భవిష్యత్తును గాలికి వదిలి ‘నాడు-నేడు, 3, 4, 5 తరగతుల విలీనమంటూ ఏడాది మొత్తం వీటిపైనే దృష్టిపెట్టిందని, ఇది లక్షలమంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి దారితీసిందన్నారు. చాలా బడుల్లో పరీక్షల్లో వచ్చిన మార్పులపై విద్యార్థులకు కనీస అవగాహన కల్పించలేదని, ఒత్తిడికి గురైన సాధారణ విద్యార్థులు పరీక్షల్లో తప్పారని, వీరిలో ఎక్కువమంది ప్రభుత్వ పాఠశాలలవారే ఉన్నారని, చాలా బడుల్లో 50 శాతంలోపే ఫలితాలు వచ్చాయన్నారు. 20 ఏళ్ల తర్వాత అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత వచ్చిందని, రాష్ట్రవ్యాప్తంగా 2,01,627 మంది ఫెయిల్ అయ్యారని, తాము చేయని తప్పునకు ఫెయిల్ కావడంతో అవమానం భరించలేక ఇప్పటికే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ముమ్మాటికీ సర్కార్ హత్యలేనని ఆరోపించారు.
మూడేళ్ల వైసీపీ పాలనలో దళితులకు దగా
మూడేళ్లల్లో దళితులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేసే ధమ్ము, దైర్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. విదేశీవిద్య, అంబేద్కర్ ఓవర్సీస్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలు రద్దు చేసి దళితుల విద్యార్థులు భవిష్యత్తు గండి కొట్టారని, వేలాది ఎకరాల దళితుల అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడి జరిగని రోజు లేదని దళితులకు అన్ని విధాలా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని శైలజనాథ్ హెచ్చరించారు.