రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజూ మోస్తరు వర్షం కురిసింది. గత మూడు రోజులతో పోలిస్తే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి వరద సహాయక చర్యల్లోకి NDRF, SDRF బృందాలు ప్రవేశించాయి. కూనవరం, చింతూరు వద్ద నలభై మంది సభ్యులతో కూడిన రెండు NDRF బృందాలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. 42 మంది సభ్యుల SDRF బృందం కోనసీమకు చేరుకుంది. రెస్క్యూ బోట్లు, రక్షణ సామగ్రితో బృందాలు రంగంలోకి దిగాయి. గన్నవరం, మంగళగిరి నుంచి బృందాలు వచ్చాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53.4 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53.4 అడుగులకు చేరడంతో ఆలయ మాడవీధులు, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్సును వరద చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సమీప మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 597 మందిని అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కిన్నెరసాని ఉధృతితో బూర్గంపాడు మండల కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బ్యారేజీకి ఏకంగా 14.45లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. తుపాకులగూడెం(సమ్మక్క సాగర్) బ్యారేజీకి 11.69 లక్షల క్యూసెక్కులు, కాళేశ్వరంలోని మేడిగడ్డ(లక్ష్మిబ్యారేజీ)కి 8.50లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీలోకి 1,95,000క్యూసెక్కల వరద వస్తోంది. ఆయా బ్యారేజీలకు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలిపెడుతున్నారు. గోదావరి నీటి మట్టం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద 11.470మీటర్లకు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 15.97మీటర్లకు పెరిగింది. ఎగువన ఎస్సారెస్పీలో కి 50,100 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 20 గేట్లు ఎత్తి 69,450 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిల్వ 91.27 టీఎంసీలకు చేరడంతో గేట్లు ఎత్తడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 చెరువులకు గండ్లు పడ్డాయని, ములుగు జిల్లాలో రెండో చోట్ల ప్రాజెక్టు కాల్వలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. అల్లూరి జిల్లా శబరి, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చింతూరు మండలం చట్టి దగ్గర జాతీయ రహదారి పైకి చేరిన వరద నీరు కూనవరంలో ఉదయభాస్కర్ కాలనీ, గిన్నెల బజార్‌లోకి వరద చేరుకుంది. వీఆర్‌పురం మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
వరద, భారీవర్షాల నేపధ్యంలో గోదావరికి వరద ప్రవాహం చేరుతున్నందున ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డా.బి.ఆర్అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, భీమవరం జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. సోమవారం రాత్రి 8గంటలకు ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 8.45 లక్షల క్యూసెక్కులు ఉందని రేపటికి మొదటి హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న జిల్లాల అధికారులతో సమన్వయ పరుచుకుని సహాయక చర్యలకు రెండు ఎన్డీఆర్ఎఫ్, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపినట్లు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, చింతూరులో ఒక ఎస్డీఆర్ఎఫ్, తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్.పురంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం ఉన్నట్లు చెప్పారు. ఈ బృందాలు ఓబియమ్ బోట్స్ , లైఫ్ బాయ్స్ , లైఫ్ జాకెట్స్ , రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నాయన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఏన్టీఆర్, కృష్ణా జిల్లాల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పలు రైళ్లను రద్దు
భారీ వర్షాల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్- ఉందానగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ (07077/07078), సికింద్రాబాద్-ఉందానగర్ మెమూ స్పెషల్ (07055), మేడ్చల్- ఉందానగర్ మెమూ స్పెషల్ (07056), సికింద్రాబాద్-ఉందానగర్-సికిం
కాఫర్ డ్యాంకు డ్యామేజీ ?
గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో దిగువ కాఫర్ డ్యాం దెబ్బతిందని జలవనరుల నిపుణులు చెబుతున్న మాటలు దీనినే సూచిస్తున్నాయి. ఇప్పటికే డయాఫ్రం వాల్ దెబ్బతిని మరమ్మతులు ఎలా చేయాలో తెలియక రాష్ట్రప్రభుత్వం సతమతమవుతుండగా.. ఇప్పుడు కాఫర్ డ్యాం కూడా దెబ్బతిందన్న వార్త ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ లెక్కన ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్, ఒడిసా, తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద దిగువకు ఉరకలు పెడుతోంది.