ఆంధ్రప్రదేశ్ గనుల శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఖనిజాన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణలో ఏపీ గనులశాఖ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ అవార్డును అందజేసింది. అదే విధంగా రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కార్ కింద రూ. 2.40 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో మైన్స్ అండ్ మినరల్స్ పై జరిగిన 6వ జాతీయ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదిగా రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గనులు మరియు భూగర్భ శాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలో ఖనిజాన్వేషణ, మైనింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర గనుల శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను పాటిస్తూ ఉత్తమ ప్రమాణాలు, విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలను గుర్తించి అవార్డులను ప్రధానం చేస్తోంది.
ఇందులో భాగంగా ‘రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కార్’ కింద ఇన్సెంటీవ్ లను కూడా అందిస్తోంది. గత రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ 10 రకాల మేజర్ మినరల్స్ కు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యక్రమాల పర్యవేక్షణలో చూపించిన పారదర్శకత, అత్యంత వేగంగా లీజుల జారీ, వేగంగా మైనింగ్ కార్యక్రమాలను ప్రారంభించేలా చేయడంలో అత్యుత్తమ విధానాలను అవలంభించింది. ఈ క్రమంలో అవార్డుకు ఎంపికైంది. ఇదిలా ఉంటే, గతంలో కేటాయించిన మైనింగ్ బ్లాక్ ల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టినందుకు అభినందనలు తెలుపుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో బాక్సైట్, ఇనుప ఖనిజానికి సంబంధించి 5 కొత్త మినరల్ బ్లాకుల జియోలాజికల్ నివేదికలను రాష్ట్రానికి అందచేశారు. వీటి విషయంలోనూ ఖనిజాన్వేషణ, వేలం ప్రక్రియ, మైనింగ్ ఆపరేషన్లను త్వరగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా డిఎంజి వెంకటరెడ్డి తెలిపారు. మైనింగ్ రంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వం వల్లే జాతీయ స్థాయి గుర్తింపును సాధించామని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
సున్నపురాయి గనుల నిర్వహణలో మైహోం, భారతి సిమెంట్స్‌కు 5-స్టార్ రేటింగ్
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ అత్యుత్తమ విధానాలతో గనులను నిర్వహిస్తున్న సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసింది. “ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్’ ఈ మేరకు దేశవ్యాప్తంగా అనేక గనులను పరిశీలించి రేటింగ్ ఇచ్చింది. గనుల నిర్వహణతో పాటు ఆయా సంస్థలు ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)’ కింద చేపట్టిన సామాజిక సేవా కార్యాక్రమాలను సైతం పరిగణలోకి తీసుకుని 5-స్టార్ రేటింగ్ ఇచ్చినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఇనుప ఖనిజం, బాక్సైట్, మాంగనీస్, లైమ్‌స్టోన్ (సున్నపురాయి) గనులను పరిశీలించి, 40 గనులను 5-స్టార్ రేటింగ్‌కు ఎంపిక చేసింది. ఇందులో సున్నపురాయి గనులు 26 ఉన్నాయి.
వీటిలో భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, మైహోం ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వరుసగా మూడో ఏడాది 5-స్టార్ రేటింగ్ సాధించి, ఉత్తమ శ్రేణి గనుల నిర్వహిస్తున్న సంస్థల జాబితాలో స్థానం నిలుపుకున్నాయి. మైహోం ఇండస్ట్రీస్ తరఫున ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రంజిత్ రావు, యూనిట్ హెడ్ ఎన్. శ్రీనివాస రావు ఈ అవార్డును అందుకోగా, భారతి సిమెంట్స్ తరఫున ఆ సంస్థ చీఫ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ సాయి రమేశ్, ఏజీఎం సుధాకర్ రాజు అందుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వీరికి అవార్డులను అందజేశారు. 5-స్టార్ రేటింగ్ తమ బాధ్యతను మరింత పెంచిందని, పర్యావరణానికి హాని కలుగకుండా ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను తూచా తప్పకుండా అమలుచేస్తూ అత్యుత్తమ విధానాలను పాటిస్తున్నందుకు తమకు ఈ రేటింగ్ కొనసాగుతోందని రెండు సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. నేషనల్ కాంక్లేవ్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భారతీ సిమెంట్ కు కేంద్ర గనుల శాఖ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం పట్ల సదరు సంస్థ యాజమాన్యం ను మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేదీ, డిఎంజి శ్రీ వెంకటరెడ్డి అభినందించారు. వరుసగా మూడేళ్ళు సస్టెయినబుల్ మేనేజ్ మెంట్ విధానాలను అవలంబించిన భారతీ సిమెంట్స్ కు ఈ గౌరవం దక్కడం అభినందనీయమని అన్నారు.