వైసీపీ నరసన్నపేట నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం 24న నిర్వహిస్తున్నట్టు మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షులు, స్థానిక సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన నరసన్నపేట మేజర్ పంచాయతీ గాంధీనగర్, ప్రశాంతి నగర్ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం కంబకాయ జంక్షన్ వద్ద ఉన్న ఎన్.ఏ.ఆర్ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉంటుందని, పార్టీ సమన్వయకర్త, మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారన్నారు. నియోజకవర్గంలోని నరసన్నపేట, పోలాకి, సారవకోట, జలుమూరు మండలాల పరిధిలో ముఖ్య కార్యకర్తలు, పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు హాజరుకావాలని, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తమ పరిధిలో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున శ్రేణులతో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య సారథ్యంలో ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని, త్వరలో జరగనున్న జిల్లాస్థాయి ప్లీనరీకి, వచ్చే నెలలో జరగనున్న పార్టీ రాష్ట్ర ప్లీనరీకి అనుబంధంగా ఈ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27వ తేదీన జిల్లాకు రానున్నారని ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. నవరత్నాలతో సహా, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, 98 శాతం హామీలనూ నెరవేరుస్తూ ప్రజారంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి జనం జయ జయధ్వానాలు పలుకుతున్నారని, ఈసారి 175 అసెంబ్లీ స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు కృష్ణదాస్ చెప్పారు.
