ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలకు మామూలుగా ప్రిపేర్ అవటం లేదు. మొత్తం పర్సనల్ మేనేజ్ మెంట్ టెక్నిక్స్ అన్నీ వాడేస్తున్నారు. ఏమైనా సరే మళ్లీ అధికారంలోకి రావాలనే పట్టుదలతో పని చేస్తున్నట్లు కనపడుతోంది. అందుకే మొత్తం ట్రెండ్ మార్చేస్తున్నారు. బయటకి రాకుండానే మూడేళ్లు గడిపేసిన జగన్ ఇప్పుడు బయటకు వస్తున్నారు. వీడియో కాన్ఫరెన్సులో బటన్లు నొక్కిన జగన్ ఇప్పుడు బహిరంగసభలు పెట్టి మరీ బటన్ నొక్కుతున్నారు. ఒక్కోసారి ఒక్కో ఏరియా కవర్ చేస్తున్నారు. ప్రతి సభలోనూ ప్రత్యర్ధులపై ఒక వ్యూహం ప్రకారం మాటల దాడి చేస్తున్నారు. అవి కూడా జనం మైండ్స్ లో రిజిస్టర్ అయ్యేలా దుష్టచతుష్టయం లాంటి పదాలు వాడుతున్నారు. ప్రజల పథకాల కోసమే తాను పని చేస్తున్నట్లు.. ఆ పథకాల వల్లే ఆర్ధిక సమస్యలు వస్తున్నట్లు.. అలాంటి పథకాలు ఆపేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నట్లు.. వివరిస్తున్నారు.
ఇక ముందు పార్టీ నేతలతో మీటింగు పెట్టారు. వారందరికీ దిశా నిర్దేశం చేశారు. 175 స్థానాలు ఎందుకు గెలవకూడదు అంటూ వారందరి బుర్రల్లోకి టార్గెట్ 175 అనేది ఎక్కించడానికి ప్రయత్నించారు.. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గడపగడపకు కార్యక్రమం పెట్టారు. జనాల్లోకి వెళ్లాలంటూ ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇచ్చారు. తర్వాత వారితోనూ మీటింగు పెట్టి.. ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేశారు. ఎవరు వెళుతున్నారు.. ఎవరు వెళ్లటం లేదు అనేది క్లాసు తీసుకున్నారు. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశాలు మొదలెట్టారు. వారికి కూడా ఎలా గెలవాలి.. ఎందుకు గెలవాలి అనేది నూరిపోస్తున్నారు.
అయితే అంతా బాగానే ఉంది.. జగన్ గారు అన్నీ ఫాలో అవుతున్నారు గాని.. ఒక్కటి మాత్రం ఫాలో అవటం లేదంటున్నారు. అదే అవతలివాళ్లు చెప్పేది వినటం. అవును.. ఏ మీటింగులో అయినా సరే అంతా వన్ సైడ్ బ్యాటింగే. ఒకవేళ ఎవరన్నా చెప్పాలనుకున్నా.. అది కూడా ముందే ఫిక్సింగ్. క్రిటికల్ గా ఎవరూ మాట్లాడలేదు.. మాట్లాడలేరు.. అంత ధైర్యం అసలే లేదు. ఇక జగన్ కు అసలు సమస్యలు ఎలా తెలుస్తాయి? అయితే జగన్ కు ఏమీ తెలియక కాదు.. తెలిసినా.. ఏం చేయాలో మాత్రమే చెబుతున్నారంటూ ఇంకొందరు వెనకేసుకొస్తున్నారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు మాత్రం మండిపడిపోతున్నారని తెలుస్తోంది. వెళ్లండి వెళ్లండి అంటున్నారు.. అక్కడ ప్రజలు అడిగే ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేదు. కనీసం సీఎం దగ్గరైనా ఉందంటే అదీ లేదు. దేనికి వెళ్లాలి.. తిట్టించుకోవడానికా? అని వాళ్లు అడుగుతున్నారంట. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను పట్టించుకోకుండా.. తామనుకున్నవే అమలు చేసుకుంటూ పోతే.. మళ్లీ ఎలా గెలుస్తాం అనే అనుమానాలు వాళ్లకు వచ్చేస్తున్నాయంట.
జగన్ మాత్రం తన ఫార్ములా ప్రకారం తాను వెళ్లిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అందరినీ ఎలా ఇన్వాల్వ్ చేయాలి అనే ప్రోగ్రామ్ ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నారు. మరి జగన్ మేనేజ్ మెంట్ సూత్రాలు పనికొస్తాయా.. పని చేస్తాయా… ఫలితాలిస్తాయా అంటే.. రెండేళ్లు ఆగితే గాని తెలియదు.