విభిన్న ప్రతిభావంతురాలికి సొంత డబ్బుతో పెన్షన్:
విభిన్న ప్రతిభావంతురాలి పెన్షన్ ను ప్రభుత్వం నిలిపివేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక 43వ డివిజన్ ఊర్మిళ నగర్ కు చెందిన ఇరువూరి ప్రశాంతి కుమారికి తన సొంత డబ్బుతో రెండు నెలల పెన్షన్ 6000 రూపాయలను జనసేన నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ (ఐజా) అందజేశారు. గురువారం ఊర్మిళనగర్ లోని ప్రశాంతి కుమారి ఇంటికి జనసేన నాయకులతో కలిసి వెళ్లిన గయాజుద్దీన్ ఆమెకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. గయాజుద్దీన్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభవంతురాలైన ప్రశాంతి కుమారి తల్లి అవుట్సోర్సింగ్ ఉద్యోగినిగా కేవలం 12000 రూపాయలు జీతానికి పనిచేస్తున్నారని, అయితే ఆమెను ప్రభుత్వ ఉద్యోగిగా చెబుతూ ఆమె కుమార్తె అయిన ప్రశాంతి కుమారికి ఈ నెల నుంచి ప్రభుత్వం పెన్షన్ను నిలుపుదల చేయడం అన్యాయమని విమర్శించారు. తన పెన్షన్ నిలుపుదల విషయమై స్థానిక కార్పొరేటర్ కోటిరెడ్డి ఇంటివద్ద ప్రశాంతి కుమారి నిన్న నిరసన వ్యక్తం చేయడంతో ఆ విషయాన్ని తెలుసుకున్న తాను ఆమెకు ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చేవరకు తన సొంత నిధులతో నెల నెలా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు గయాజుద్దీన్ ప్రకటించారు. కేవలం నెలకు 12 వేల రూపాయలు వచ్చే ఔట్సోర్సింగ్ ఉద్యోగిని కుమార్తె ప్రశాంతి కుమారి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందని అన్నారు. వెంటనే ఆమెకు విభిన్న ప్రతిభావంతురాలి పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాగా ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చే వరకు తన సొంత నిధులతో ప్రశాంతికుమారికి ఆర్థికసహాయం అందజేస్తానని గయాజుద్దీన్ ప్రకటించడం పట్ల స్థానికులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగం శివప్రసాద్, అబ్దుల్ మున్నా, షేక్ ఇస్మాయిల్, సయ్యద్ అలీ,షేక్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.