మొహమ్మద్ ప్రవక్త గురించి బీజేపీ అధికారి చేసిన వ్యాఖ్యలపై వివాదం రోజురోజుకు ముదురుతుందే తప్ప సద్దుమణగే సూచనలు కనపడటం లేదు. అక్కడికి భారత్ సదరు బీజేపీ అధికారిని తొలగించింది. పైగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమె కూడా క్షమపణలు చెప్పింది కూడా. అయినప్పటికీ గల్ఫ్ దేశాలు శాంతించకపోగా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కువైట్‌లోని అల్ అర్దియా కో -ఆపరేటివ్ సొసైటీ సూపర్ మార్కెట్ భారతీయ ఉత్పత్తులను నిషేధించిది.
ఆ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ ఉత్పత్తులను వాడేది లేదంటూ ఒక ట్రాలిలో ప్యాక్ చేసి పక్కనే పెట్టేశారు. సదరు స్టోర్ సీఈవో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సహించం అందుకే భారతీయ ఉత్పత్తులను తొలగిస్తున్నాం అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ బీజేపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా తీవ్రంగా మండిపడుతోంది. భారత విదేశీ కార్మికులకు గల్ఫ్ దేశాలు ప్రధాన గమ్యస్థానంగా ఉన్నాయి.
అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 13.5 మిలియన్లలో 8.7 మిలియన్ల మంది భారత విదేశీ కార్శికులు ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాలలో తెలుస్తోంది. భారత్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కువైట్ సుమారు 95 శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అదీగాక భారత్ ఆహార భద్రత, ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా గోధుమల ఎగుమతులను నిషేధించిన సమయంలో కూడా కువైట్ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వమని కోరడం గమనార్హం.మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ లీడర్లు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ దేశాల సంఖ్య పెరిగింది. ఖతర్, కువైట్, బహ్రైన్, ఇరాన్ దేశాల జాబితాలో తాజాగా గల్ఫ్ పెద్దన్న సౌదీఅరేబియా కూడా చేరింది.
క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సస్పెండ్ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నూపుర్ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు ట్విటర్ ద్వారా స్పందించారు.
ఆమె తన వైఖరిని వివరిస్తూ ‘గత చాలా రోజులుగా మా మహాదేవ్ శివుడిని అవమానిస్తూ, అగౌరవపరుస్తుండటంతో నేను టీవీ చర్చలకు హాజరవుతున్నాను. జ్ఞానవాపి మసీదు వద్ద ఉంది లభించింది శివలింగం కాదు.. ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబుతున్నారు. శివలింగాన్ని ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చడం ద్వారా కూడా వెక్కిరిస్తున్నారు. మా శివుడిని ఇలా నిరంతరంగా అగౌరవపరచడాన్ని నేను సహించలేకపోయాను. దీనిపై ప్రతిస్పందిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పాను* అని నూపుర్ శర్మ చెప్పారు.
హమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలిగిస్తున్నట్లు వెల్లడించింది. సస్పెన్షన్ లెటర్‌లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావును మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని’ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పరేడ్ మార్కెట్‌లోని దుకాణాలను మూసివేయాలని ముస్లిం వర్గం పిలుపునిచ్చింది. యతింఖానా చౌరహా వద్ద మార్కెట్ బంద్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొవడలు చెలరేగాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే పోలీసులపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో స్థానికంగా అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులతో సహా 40 మంది గాయపడ్డారు.
నుపుర్ గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం
వృత్తిపరంగా న్యాయవాది అయిన నుపుర్.. భారతీయ జనతా పార్టీకి ఉన్న ప్రముఖ అధికార ప్రతినిధుల్లో ఒకరు. అఖిల భారత విద్యార్థి పరిషద్ టికెట్ పై ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఎన్నికైన ఆమె అదే యూనివర్సిటీలోని హిందూ కాలేజీ నుంచి ఆర్థశాస్త్రం, న్యాయశాస్త్రాల్లో డిగ్రీ చేశారు. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నుపుర్.. బీజేపీ యూత్ వింగ్ అయిన బీజేవైఎంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పని చేశారు. అనంతరం బీజేవైఎం నేషనల్ మీడియా కో-ఇంచార్జ్, బీజేపీ యువ వర్కింగ్ కమిటీ మెంబర్, ఢిల్లీ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పని చేశారు.
బీజేపీ తరపున అనేక విషయాల్లో టీవీ డిబేట్లలో నుపుర్ పాల్గొన్నారు. బీజేపీకి చెందిన ప్రముఖ అధికార ప్రతినిధుల్లో నుపుర్ ఒకరు. అలాగే టెక్ ఫర్ ఇండియా యూత్ అంబాసిడర్ గా గతంలో కొనసాగారు. ఇక ఎన్నికల బరిలో కూడా నుపుర్ నిలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అన్ని మతాలను గౌరవిస్తాం-బీజేపీ
నూపుర్ శర్మపై సస్పెన్షన్ వేటుకు కొద్దిసేపటి ముందే బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఒక మతాన్ని, వర్గ మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలకు పార్టీ అంగీకరించదని అన్నారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందనని, ఎవరైనా మతపరంగా మనోభావాలను దెబ్బతీస్తే, మతపరమైన వ్యక్తులను అవమానించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.
@Mayawati -1. देश में सभी धर्मों का सम्मान जरूरी। किसी भी धर्म के लिए आपत्तिजनक भाषा का इस्तेमाल उचित नहीं। इस मामले में बीजेपी को भी अपने लोगों पर सख्ती से शिकंजा कसना चाहिए। केवल उनको सस्पेंड व निकालने से काम नहीं चलेगा बल्कि उनको सख्त कानूनों के तहत् जेल भेजना चाहिए। 1/2
నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లపై సస్పెండ్ సరిపోదు-మాయావతి
నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లపై వేటు వేయడంతోనే సరిపెట్టకుండా కఠిన చట్టాల ప్రకారం వారిని జైలుకు పంపించాలంటూ బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి అన్నారు. అలాగే కాన్పూర్ అల్లర్లను అదుపు చేసే ప్రయత్నాల్లో అమాయక ప్రజలను వేధింపులకు గురి చేయొద్దని ఆమె డిమాండ్ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన ఈ ఇద్దరు నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
ఈ విషయమై మాయావతి స్పందిస్తూ ‘‘దేశంలో అన్ని మతాలకు గౌరవం అవసరం. ఏ మతంపై అయినా అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించడం సరికాదు. ఈ విషయంలో బీజేపీ తన ప్రజలపై ఉక్కుపాదం మోపాలి. మత విధ్వేషాలు రెచ్చగొట్టే వారిని సస్పెండ్ చేయడం, బహిష్కరించడం మాత్రమే చేస్తే సరిపోదు. కఠిన చట్టాల ప్రకారం వారిని జైలుకు పంపాలి. ఇది మాత్రమే కాదు, ఇటీవల కాన్పూర్‌లో జరిగిన హింసాకాండ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో, ఈ హింసకు వ్యతిరేకంగా పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో అమాయక ప్రజలను వేధించకూడదు. ఇది బీఎస్పీ డిమాండ్’’ అని ట్వీట్ చేశారు.
నుపుర్ శర్మను అరెస్ట్ చేయాల్సిందే: అసదుద్దీన్ ఒవైసీ
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్ట్ చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల గల్ఫ్ దేశాల్లో భారత్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, అరబ్ దేశాల్లో భారత్ ముఖం చెల్లకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత విదేశాంగ విధానం నాశనమైపోయిందన్నారు. నుపుర్ శర్మను సస్పెండ్ చేస్తే సరిపోదని, ఆమెను అరెస్ట్ చేయాలని అన్నారు.