ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు పై అన్ని వర్గాల్లోను అసహనం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు విద్యుత్ కష్టాలతో పవర్ హాలీడే ప్రకటించారు. ఆ సమస్య గురుంచి మరిచిపోకముందే ఇప్పుడు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చింది.. కోనసీమలో 2011లో రైతులు క్రాప్ హాలిడేను ప్రకటించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత తిరిగి క్రాప్ హాలిడేను ప్రకటించడం చర్చనీయాంశమైంది. కోనసీమ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించాలని నిర్ణయించారు. కోనసీమ రైతుల పరిరక్షణ సమితి ఈ నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాలోని 12 మండలాల్లో క్రాప్ హాలిడేను ప్రకటించారు. ప్రభుత్వం సహకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. పంటలు వేయడానికి కూడా తమకు డబ్బులు లేవని, అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎరువుల ధరల దగ్గర నుంచి అన్నీ పెరగిపోయాయని, కానీ మద్దతు ధర మాత్రం లభించడం లేదని చెబుతున్నారు. సేకరించిన ధాన్యానికి కూడా సకాలంలో డబ్బులు చెల్లించడం లేదన్నారు.
తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా క్రాప్ హాలిడే అంశం కాకరేపుతోంది. ఇది రాజకీయంగా టీడీపీ ఆడుతున్న డ్రామా అంటూ అధికార పార్టీ అటాక్ చేస్తుంటే కాదు ఇందులో రాజకీయం లేదంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు కొందరు రైతులు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిపోయింది..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్ర అన్నపూర్ణగా ప్రాముఖ్యతను సొంత చేసుకుంది కోనసీమ. ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైంది. అయితే పరిస్థితిలో మాత్రం మార్పులేదు. సాగు కష్టాలు ఆనాటి నుంచి నేటి వరకు కోనసీమ అన్నదాతలను వేధిస్తూనే ఉన్నాయి. రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చింది కోనసీమ రైతు పరిరక్షణ సమితి. దీంతో కోనసీమ రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో క్రాప్ హాలిడే పాటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. తాజాగా జిల్లాలోని 12 మండలాల్లోనూ క్రాప్ హాలిడే పాటించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది.
కోనసీమ రైతుల క్రాప్ హాలీడే ప్రకటనపై మంత్రి విశ్వరూప్ తీవ్రంగా స్పందించారు. అమలాపురం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి విశ్వరూప్ టీడీపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. క్రాప్ హాలిడే పేరుతో ప్రభుత్వంపై బురద చల్లడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. రాజకీయ లబ్ది కోసం తెలుగుదేశం పార్టీ ఆడుతున్న నాటకమే క్రాప్ హాలిడే అంటూ విరమ్సలు చేశారు. నిజమైన రైతులు టీడీపీ ప్రలోభాలకు లోనుకాకుండా క్రాప్ హాలీడే ప్రకటనను ఖండించాలని మంత్రి పిలుపునిచ్చారు. జూన్ 1వ తేదీకే సాగునీటి విడుదలతో మూడు పంటలు పండించడానికి అవకాశం ఉందని ఇలాంటి అవకాశాలను జారవిడుచుకోవద్దని సూచించారు మంత్రి విశ్వరూప్. టీడీపీ వలలో పడొద్దని రైతులకు సలహా ఇచ్చారు. రైతులు నిరభ్యంతరంగా మొదటి పంట సాగు చేసుకోవచ్చన్నారు.
కోనసీమలోని క్రాఫ్ హాలిడే ఉద్యమంలో రాజకీయ కోణం లేదని కొందరు రైతులు ప్రకటించారు. ఆర్డీవో రమ్మంటే వచ్చామని ఆర్డీవో కానీ కలెక్టర్ కార్యాలయంలో గానీ అధికారులు ఎవరు అందుబాటులో లేరని చెప్పుకొచ్చారు. ఇటువంటి రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే రైతులు నష్టాలను భరించలేక ఉద్యమం బాట పట్టామని వెల్లడించారు. ఈ ఉద్యమంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారన్నారు. అంతేగాని ఇది రాజకీయ కోణంలో చూడొద్దని ప్రభుత్వానికి సూచించారు రైతులు.
కోనసీమ జిల్లాలో 12 మండలాల్లో క్రాప్ హాలిడే పాటించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలోనే క్రాప్ హాలిడే పాటిస్తున్నామని రైతులంటున్నారు. కోనసీమలోని క్రాఫ్ హాలిడే ఉద్యమంలో రాజకీయ కోణం లేదని రైతులు స్పష్టం చేశారు. క్రాప్ హాలీడే ప్రకటించిన తర్వాత రైతులను ఆర్డీవో పిలిపించారు. అయితే రైతులు వచ్చేసరికి ఆర్డీవో అందుబాటులో లేరు.
నష్టాలు భరిస్తూ సాగు చేయలేమని ప్రకటించిన కోనసీమ రైతులు
రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే రైతులు నష్టాలను భరించలేక ఉద్యమ బాట పట్టినట్లు రైతులు ప్రకటించారు. ఈ ఉద్యమంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అంతేగాని ఇది రాజకీయ కోణంలో చూడొద్దని రైతులు కోరుతున్నారు. ప్రధానంగా మూడు డిమాండ్లు అధికారుల ముందు ఉంచాలని వచ్చాం.. అధికారులు రమ్మని పిలిచారు కానీ అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. కార్యచరణను త్వరలోనే ప్రకటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
స్వచ్చందంగా నిర్ణయం తీసుకున్నామంటున్న రైతులు
తమ ఉద్యమంలో ఇందులో భూస్వాముల లేరని వారు ఉద్యమానికి సహకరించరని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా నష్టపోయేది రైతులే కానీ భూస్వాములు కాదంటున్నారు. డ్రైన్లు అధ్వానంగా మారాయి తొలకరి పంట ఊడ్చితే వర్షాలకు ముంపుకు గురయ్యి రైతులు నష్ట పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలి డ్రెయిన్లు ఆధునికరించాలి రైతులకు అవసరమైన సమయంలో ఉపాధి హామీ పనులను తాత్కాలికంగా నిలపాలి ఇవే మా ప్రధాన డిమాండ్లు అనిరైతులు చెబుతున్నారు.
ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపిన రైతులు
ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని యాంత్రీకరణ విషయంలోనూ రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఇప్పటికే అన్ని మండలాల్లోనూ తహాసిల్దార్ లకు వినతి పత్రాలు అందించామని త్వరలోనే తమ ఉద్యమ కార్యాచరణను వెల్లడిస్తామన్నారు. ఆర్డీవో పిలిస్తే వచ్చిన రైతులు ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో గంట సేపు వేచి చూసి నిరసన తెలిపి తిరిగి వెళ్లిపోయారు. తమ పోరాటం ఆగదని ప్రకటించారు.
కోనసీమలో క్రాప్ హాలిడే సెగలు రాజుకున్నాయి. ఉద్యమ కార్యచరణ దిశగా రైతులు అడుగులేస్తున్నారు. ఆర్డీవో కార్యాలయాలు ముట్టడించిన రైతులు అధికారులు అందుబాటులో లేకపోవడంతో భిక్షాటన చేస్తూ నిరసనలు తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఏటా డెల్టా కాలువలకు జూన్ 10 తరువాత సాగు నీటిని విడుదల చేసేవారు. అయితే ఈ ఏడాది పది రోజులు ముందుగానే నీటిని విడుదల చేసారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా కోనసీమలో ఎక్కడా వరి సాగుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ లోపాలు శాపంలా మారాయి. గోదావరి నదీ సముద్రంలో కలిసే ప్రాంతం కావడంతో ప్రతీ ఏటా సంభవించే వరదలు రైతులను నష్టాల్లోకి నెడుతున్నాయి. తూర్పు మధ్య డెల్టాలోని మేజర్, మైనర్ ఇరిగేషన్ కాలువలకు మరమ్మత్తులు చేపట్టి ఏళ్లు గడచిపోయింది. ఇక శివారు ప్రాంతాలకు నీరందడం మాట అటుంచితే మధ్య డెల్టాలో పూర్తి స్థాయిలో సాగునీరు అందని దుస్థితి నెలకొంది. ఫాల్ స్లూయిజ్‌లు, గ్రోయిన్లు పూర్తిగా దెబ్బతినడంతో అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న తరహాలో ఉంది రైతులు పరిస్థితి. సాగు నీరు సరిపడా ఉంటే పరిస్థితి అదుపులో ఉన్నా వరదల సమయంలో మాత్రం పంటలను ముంచెత్తుతోంది ఉగ్ర గోదావరి.