బెజవాడ దుర్గమ్మ ఆలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఇక్కడ శ్రీ చక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలిసింది కోరిన వారికి వరాలిచ్చే కొంగుబంగారంగా బెజవాడ కనకదుర్గ వాసికెక్కింది. ఈ దుర్గ గుడి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. అందుకే ఇక్కడకు వచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకుని, ఆపై అమ్మవారిని మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ఆశీస్సులు పొందుతుంటారు. వాస్తవానికి కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. ఆభరణాలు, రకరకాల పువ్వులతో అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.
పేరు వెనుక చరిత్ర
కృత యుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతం గా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు, అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు, ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు, శివుడి కోసం తపస్సు చేసి, శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక, ఈ ప్రాంతం విజయవాడ అయింది.
క్షేత్ర పురాణం
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి, ఇక్కడ శ్రీ చక్ర ప్రతిష్ట చేశారని, ప్రతీతి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి, దుర్గాదేవిని గురించి తపస్సు చేసి, అమ్మవారిని తనపైనే నివాసం ఉండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి ఇక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి) కొండ పై కొలువు తీరింది. అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివ లీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు. నవరాత్రి ఉత్సవాలు ఈ దుర్గాదేవి అమ్మవారికి, ప్రతి సంవత్సరం దసరా నవ రాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ దసరా ఉత్సవాలలో ప్రతిరోజు ఒక అవతారంతో అమ్మవారు దర్శనం ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు, తొమ్మిది అవతారాలతో కనువిందుగా అమ్మవారు దర్శనం ఇస్తారు.
పరిసరాల్లోని ఇతర ఆలయాలు
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, నటరాజ స్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి, భక్తితో పూజలు చేస్తారు.
ఆలయంలో చేసే ప్రధాన పూజలు
ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణ పుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం ప్రధాన పూజలు. ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు 516 రూపాయలు చెల్లించి. వేకువజామున నాలుగు గంటలకు ఆలయానికి చేరుకోవాలి. రెండు గంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది. ఒక టికెట్ పై దంపతులను అనుమతిస్తారు. మిగతా పూజలకు రుసుం 516 రూపాయలు మాత్రమే, ఈ పూజలు ఉదయం 9గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగుతుంది. ఒక టికెట్ పై దంపతులు పాల్గొనవచ్చు. ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే ఆలయానికి చేరుకోవాలి. ప్రధానమైన పూజల్లో స్వర్ణ పుష్ప పూజ ఒకటి ప్రతి గురువారం సాయంత్రం ఐదు గంటల 15 నిమిషాల నుంచి 6:30 వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణ పుష్పాలతో జరిగే ఈ పూజలో, భక్తులు 2500 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చు. కేవలం 7 టికెట్లు మాత్రమే ఇస్తారు. రోజు సాయంత్రం 6:00 నుంచి 6:30 వరకు హారతుల సమయం. ఈ సమయంలో అమ్మవారి హారతులు తిలకించేందుకు 200 రూపాయలు టికెట్ తీసుకుంటే ఒక టికెట్ పై ఇద్దరు చొప్పున అనుమతిస్తారు. స్థలాభావం కారణంగా కేవలం 20 టికెట్లు మాత్రమే రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి దేవస్థానం అధికారులు కౌంటర్లో విక్రయిస్తారు. దసరా ఉత్సవాలు, భవాని దీక్షలు, బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఈ పూజలు నిర్వహించుకోవచ్చు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేష వస్త్రం, రవిక ,లడ్డు ప్రసాదం అందజేస్తారు.
దేవస్థానంలో పూజలు
ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో పరిమిత దినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 7:00 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్బారు సేవ, ఆదివారం సాయంత్రం 7:00 నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సేవలు జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు కృష్ణా నది తీరాన, దుర్గా ఘాట్లో కృష్ణమ్మకు, పంచ హారతులను ఇస్తారు. ఈ హారతులను భక్తులంతా తిలకించవచ్చు. దసరా రోజుల్లో భవానీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేస్తారు.
అన్న ప్రసాద వితరణ
1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. భక్తులు అందించిన విరాళాలను, బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వాటిపై వచ్చే ఆదాయంతో, రోజు 5000 మందికి, ఉదయం 10:00 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ,అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు.
రవాణా సౌకర్యాలు
విజయవాడ రైలు- రోడ్డు- విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది .కోల్ కతా- చెన్నై జాతీయ రహదారిపై ఉన్న నేపథ్యంలో విజయవాడకు నలుమూలల నుంచి రోడ్డు మార్గంలో చేరడం చాలా సులభం. ఆపై ఇక్కడి పండిట్ నెహ్రూ సెంటర్ బస్ స్టేషన్ నుంచి, ఇంద్రకీలాద్రి పైకి ప్రతి 10 నిమిషాలు కో ఆర్ టి సి సిటి మెట్రో బస్సుల చొప్పున ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆటోలు/ క్యాబ్లు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకోవచ్చు. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ,ఆర్టీసీ మెట్రో బస్సులతో పాటు ప్రైవేటు ఆటోలు- క్యాబ్లు విస్తృతంగా లభిస్తాయి. గన్నవరం విమానాశ్రయం ద్వారా కూడా సుదూర ప్రాంతాల వారు సులభంగా విజయవాడ ఇంద్రకీలాద్రిని చేరవచ్చు.
దసరా అలంకారాలు
మొదటిరోజు స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి, రెండవ రోజు బాల త్రిపుర సుందరి దేవి, మూడవ రోజు గాయత్రీ దేవి, నాలుగవ రోజు అన్నపూర్ణ దేవి, ఐదవ రోజు లలిత త్రిపుర సుందరీ దేవి ,ఆరవ రోజు సరస్వతీ దేవి ,ఏడవ రోజు దుర్గాదేవి, ఎనిమిదవ రోజు మహాలక్ష్మి దేవి, తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని, పదవ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తుల కు దర్శన మిస్తారు. ఈ ఐదవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు, అమ్మవారి జన్మ నక్షత్రంగా, అనగా మూలానక్షత్రంగా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీరాముల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుటకు, అనేకమంది భక్తులు, అనేక ప్రదేశాల నుండి వస్తారు.