ఆంధ్ర ప్రదేశ్ ను అధోగతిపాలు చేసి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెలుగు జాతిని తాకట్టు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. రాష్ట్రానికి మోసంతో కూడిన తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి మద్దతు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. మతోన్మాదులతో చేతులు కలిపి రాష్ట్రం పరువు తీసారని విమర్శించారు. ఏం భయంతో కేంద్రం వద్ద జగన్ రెడ్డి మెడలు వంచారు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని బీజేపీకి మద్దతు పలికిన జగన్ రెడ్డి మేక వన్నె పులి అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆయన న్యూ ఢిల్లీ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నిటినీ నెరవేర్చాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను జగన్ రెడ్డి ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. జగన్ ఇదేమీ చేయకుండా మౌన ముద్ర దాల్చడం, దీనిపై మాట్లాడకుండా వైసీపీ ముఖ్య నేతలను సైతం కట్టడి చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాలదన్ని స్వీయ ప్రయోజనాల కోసం మరోసారి ఎన్‌డీఏకి బేషరతుగా మద్దతు తెలపడం శోచనీయమని శైలజనాథ్ అన్నారు.
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ల దాటినా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, రెవెన్యూ లోటు భర్తీ చేయలేదని, రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, పోలవరం, విశాఖ రైల్వే జోన్ వంటి అనేక విభజన హామీలను నెరవేర్చక పోయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేంద్రానికి వత్తాసు పలకడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని శైలజనాథ్ హెచ్చరించారు.