దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథ రథయాత్ర చాలా ప్రసిద్ధి చెందింది. చాలా ప్రాంతాల్లో జగన్నాథుని రథయాత్ర జరుగుతున్నప్పటికీ.. ఒడిశాలో జరిగే ఈ రథయాత్ర క్రేజే వేరు. జ్యేష్ఠ పూర్ణిమ రోజున జగన్నాథుడు, సోదరి సుభద్ర మరియు అన్నయ్య బలభద్రలు పుణ్యస్నానం చేస్తారు. తర్వాత ముగ్గురినీ ఆలయ గర్భగుడిలో ఉంచి రెండో రోజు నుంచి గర్భగుడి తలుపులు మూసేస్తారు. అనంతరం 15 రోజుల తర్వాత జగన్నాథుడు రథంపై బయల్దేరి భక్తులకు దర్శనం ఇస్తారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసి పోయింది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా పూరీ జగన్నాథ రథయాత్ర చేపట్టలేదు. కరోనా తగ్గిన నేపథ్యంలో ఈసారి భక్తులకు యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.
జగన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా భక్తులు ఈ వేడుకలను తిలకించలేకపోయారు. ఈసారి అంతా చూసేందుకు అవకాశం కల్పించడంతో గురువారం నుంచే పూరీ నగరం భక్త జనసంద్రాన్ని తలపించింది. ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో చేరుకుంటారు. ఊరేగింపునకు నందిఘోష్ (జగన్నాథుడి రథం), తాళధ్వజ (బలభద్రుడిది), దర్పదళన్ (సుభద్ర) రథాలు సిద్ధమయ్యాయి. పూరీ పట్టణం లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతోంది. ఐదు అంచెల బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ సునీల్ బన్సల్ గురువారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. రథయాత్రలో తొక్కిసలాటకు తావు లేకుండా బందోబస్తు చేశామని తెలిపారు. శుక్రవారం ఈ ప్రాంతాన్ని ‘నో ఫ్లయింగ్ జోన్’ చేయాలని విమానాశ్రయ యంత్రాంగాన్ని కోరామన్నారు. ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
కళాఖండం మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్లోని అహ్మదాబాద్లోని జగన్నాథ్ మందిరంలో మంగళహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘కొవిడ్ వల్ల రెండేళ్లుగా రథయాత్రకు భక్తలను అనుమతించలేదు. ఈ సంవత్సరం మళ్లీ అనుమతిస్తుండటం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఒడిశా ప్రజలు, దేశ ప్రజలకు ఇదొక గొప్ప పండగ’ అని గజపతి మహారాజా దిబ్యాసింగ్ దేబ్ అన్నారు.
పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాదిపాటు గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథాయాత్ర జరిగే రోజున తన సోదరి సుభధ్ర, సోదరుడు బలభద్రుడితో కలసి రథం అధిరోహిస్తాడు. ఈ రథయాత్రకి సంబంధించి చాలా విశేషాలున్నాయి .. ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణంలాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకి వాడతారు. కానీ పూరీలో అలాకాదు! సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలు తయారుచేస్తారు. వీటి తయారీని అక్షయతృతీయ రోజున మొదలుపెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అనీ బలభద్రుని కోసం తయారుచేసే రథాన్ని తాళధ్వజం అనీ సుభద్ర కోసం తయారుచేసే రథాన్ని దేవదాలన అనీ పిలుస్తారు. ఈ రథాలని తయారుచేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి. దానికి ఎన్ని చక్రాలు ఉండాలి. ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలిలాంటి లెక్కల్ని తూచాతప్పకుండా పాటించాలి. రథాన్ని తయారుచేసేందుకు ఎన్ని చెక్కముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది. ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండవచ్చు. కానీ పూరీకి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరీ రాజు, జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపురతో ఊడుస్తాడు.
మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి. కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. జగన్నాథుడికి గుండిచా అనే పిన్నిగారు ఉన్నారు. ఆవిడ ఉండే గుడి పూరీ ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు ఓ తొమ్మిదిరోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు. తిరిగి ఆషాఢమాసంలోని పదోరోజున పూరీ గుడికి చేరుకుంటాడు. మన దగ్గర రాములవారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారీ వర్షం పడటం ఓ విశేషం. జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్లడం ఇష్టం ఉండదేమో! అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు. కొన్ని గంటలపాటు కొన్ని వేలమంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవ్వదు. జగన్నాథుడు గుండిచా ఆలయం నుంచి తిరిగివచ్చే యాత్రని ‘బహుద యాత్ర’ అంటారు. ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ ‘మౌసీ మా’ అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయల్దేరతాయి. జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత ‘సునా బేషా’ అనే ఉత్సవం జరుగుతుంది. అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతురన్నమాట! దీనికోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు.