“శ్రీమంతుడు” అనే సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు. ” ఇప్పటికే ఊరి నుండి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి లేకపోతే లావైపోతారు”అంటాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం తనను అడ్డుకున్న విషయాలు మర్చిపోకుండా తిరిగి ఇచ్చేస్తున్నారు. టిడిపి అధినేతను, యువ నాయకుడిని వీలు కుదిరిన ప్రతిసారీ జగన్ ప్రభుత్వం అడ్డుకుంటున్నారు.
తాజాగా లోకేష్‌ను ఉత్తరాంధ్ర పోలీసులు మొత్తం ఏకమై అడ్డుకున్నారు.దీనివల్ల జగన్ తృప్తి పొందుతూ ఉండవచ్చు గానీ చంద్రబాబుకు, లోకేష్ కు వాళ్ళు అనుకొని మైలేజ్ వస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ కౌన్సిలర్ ఇంటిని అక్రమం అంటూ కూల్చివేయించారు. ఆ ఇంటిని చూసేందుకు వెళ్తున్న లోకేష్‌ను ఉత్తరాంధ్ర పోలీసులు మొత్తం కలిసి ఆపేశారు.చివరికి విశాఖలో కూడా ఆయనను మీడియాతో మాట్లాడనివ్వలేదంటే ఏవిధంగా లోకేష్ యాత్రను జగన్ ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందో అర్దం అవుతుంది.అంతేకాకుండా పలాస వచ్చి సవాల్ చేస్తే ఊరుకుంటామా అని మంత్రి సీదిరి అప్పలరాజు అంటున్నారు.
మామూలుగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పర్యటనలు అడ్డుకుంట,ఒక్కోసారి అది అధికార పార్టీకే నష్టం జరుగుతుంది. ఆ విషయం అనేక సార్లు రుజువయింది. ఇప్పటికీ వైసీపీ ఆ అడ్డుకునే వ్యూహం నుంచి బయటకు రావడం లేదు.లోకేష్ పర్యటన మామూలుగా సాగి ఉంటే ఆయన టీడీపీ నేతను పరామర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేసి వెళ్లేవారు.కానీ ఇలా అడ్డుకోవడం వల్ల మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన మైలేజ్ వచ్చింది.
అయినా కూడా జగన్ ప్రభుత్వం ఈ అడ్డుకోవడాలను అప్పేటట్లు కనిపించడం లేదు. మామూలు టీడీపీ నేతలను అయితే గృహ నిర్భంధాలు, అరెస్టులు సర్వసాధారణం అయిపోయాయి. టిడిపి అధినేత చంద్రబాబు కు కూడా ఈ అడ్డగింతలు తప్పలేదు. చంద్రబాబు ను చాలా సార్లు హౌస్ అరెస్టులు చేశారు, రెండుసార్లు తిరుపతి,వైజాగ్ ఏయిర్ పోర్ట్ ల నుండి వెనుకకు పంపించారు. ఇప్పుడు లోకేష్ ను కూడా అడ్డుకున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ చేసిన పనికి ఇది ప్రతీకారం అని ప్రజలు అనుకుంటున్నారు.