ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి మరో కార్యక్రమానికి ప్రారంభించ బోతుంది. పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య పరీక్షలు అందించాలనే లక్ష్యంతో సెప్టెంబరు 1వ తేదీ నుంచి “ఫ్యామిలీ డాక్టర్” అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఒక డాక్టర్ తో కూడిన వైద్య బృందం ప్రజలకు సేవలందిస్తారు. ఆ విధంగా సేవలు పొందిన ప్రజల వివరాలు ఒక చోట పొందుపరచి, భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు సులభంగా వైద్య సదుపాయం అందించే విధంగా ప్రణాళిక రూపొందించారని వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజని తెలిపారు.
పల్నాడు జిల్లాలోని ఓ రిమోట్ పల్లె ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. వైద్య శిబిరం నిర్వహించడం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు దూర ప్రాంతంలోని ఆసుపత్రికి వెళ్లకుండా మీ దగ్గరకే ఎంతో నైపుణ్యం కలిగిన వైద్యులు వచ్చి సేవలందిస్తున్నారని, ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలకు తెలిపారు.