రాష్ట్రంలో నవరత్నాల పేరుతో మహిళల జీవితాలను నవరంధ్రాలతో తూట్లు పొడిచారని, జగన్ రెడ్డి మహిళా ద్రోహి అని రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒంటరి మహిళకు ఇచ్చే పింఛన్ పై కక్కుర్తిపడిన చెత్త ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు.
ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్ 30 సంవత్సరాల నుంచి తీసేసి 50 సంవత్సరాలకు ఇస్తాననడం ఎంత వరకు సమంజసమన్నారు. 50 సంవత్సరాల వరకు ఆధారం లేని మహిళలు ఎలా బ్రతకాలి, ఏమి తిని బతకాలని ప్రశ్నించారు. ఒంటరి మహిళలు అంటే అర్థం తల్లిదండ్రుల మీద తోబుట్టువుల మీద ఆధారపడి బతికే వాళ్ళని, అందులో పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. భర్తను కోల్పోయిన వారు ఉంటారు.భర్త బిడ్డలు లేని వారు కూడా ఉంటారు. వీరందరూ వారి అవసరాల కోసం తోబుట్టువులని, తల్లిదండ్రుల్ని ఒక్క రూపాయి కూడా అడగలేని పరిస్థితులు ఉండొచ్చు అన్నారు. వారికి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా పింఛన్ వారికి ఒక ఆసరాగా ఉంటుందన్నారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఒంటరి మహిళ పథకాన్ని ప్రవేశపెడితే వయసుతో సంబంధం లేకుండా నెలకు రూ. 2 వేలు పింఛన్ ఇచ్చేవారని, దానితో వారు మనోధైర్యంగా బతికేవారని, జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని నాశనం చేసి చివరికి ఒంటరి మహిళ మీద కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. జగన్ రెడ్డి ఎన్నికల హామీలు లో అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటానని ఒక అన్నగా మీకు భరోసా ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంటరి మహిళలను మోసం చేశాడు అన్నారు.
ఒక్క అవకాశమని మహిళల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వారి జీవితాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఒంటరి మహిళ పింఛన్లు పై తీసుకున్న మోసపూరిత జీవోను వెంటనే రద్దు చేయాలని, చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా ఇచ్చారో అదే విధంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.