పశ్చిమ గోదావరి : జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు తీర ప్రాంత మత్స్యకారులకు సముద్రంలో చేపల వేట జీవనాధారం. జిల్లాలో అధిక శాతం మత్స్యకారులు ఈ మండలాల్లోనే అధిక సంఖ్యలో ఉన్నారు. ఇటీవల కాలంలో సముద్రంలో మత్స్య సంపద తరిగిపోవడంతో వారందరికీ జీవనోపాధి లేక ఇతర పనుల వైపు వెళ్లాల్సిన పరిస్థతులు నెలకొన్నాయి. అపార మత్స్య సంపద పట్టుబడి, ఎగుమతులతో స్థానికులతో ఉపాధి, ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం లభించేది. ఆధునిక జీవన పరిస్థితుల నేపథ్యంలో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోంది. ప్రకౄతి వైరీత్యాలైన తుఫాను, అల్పపీడనం, పెరిగిన డీజిల్ ఖర్చులు, బోటు నిర్వహణ భారంతో మత్స్యకారులు వేట సాగించలేని పరిస్థితి. దీనికితోడు కాలుష్యం ప్రధాన సమస్యగా పట్టిపీడిస్తోంది. జనావాసాలు, పరిశ్రమల కాలుష్యం సముద్ర జలాల్లో కలవడం, ఆయిల్ నిక్షేపాల వెలికితీత చర్యలతో కడలిలో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోంది. వేరే ఆదాయ మార్గంలేని మత్స్యకారులు వేట సాగించినా పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వపరంగా వారికి ఏవిధమైన సహకారం లేకపోవడంతో వారి పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. సబ్సిడీపై వలలు, వేట సామగ్రి, రుణాల మంజారు, పిల్లల చదువులకు ప్రత్యేకంగా ఏవిధమైన సంక్షేమ పథకాలు లేకపోవడం మత్స్యకారుల జీవనం తల్లకిందులైంది.
గోదావరి సముద్ర సంగమం ప్రత్యేకత
పశ్చిమ గోదావరి జిల్లాలోని సముద్ర తీరం ప్రాంతంలో నరసాపురం సమీపంలోని అంతర్వేది ప్రాంతం ప్రత్యేకం. గోదావరి వశిష్ట పాయం అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. సమీప సముద్ర జలాల్లో అపార మత్స్య సంపద లభిస్తుంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న అనేక రకాల చేపలు ఈ ప్రాంతంలో లభ్యమవుతాయి. చందువా, వంజరం, పండుగప్ప వంటి సంప్రదాయ సంపదతో పాటు మారిన ఆధునిక జీవనంలో భిన్నవర్గాలు కోరుకునే గోల్డ్ రిబ్బన్, టూనా వంటి రకాలు, మొగల్తూరు తీరంలో అరుదైన రకాలు మత్స్యకారులకు సిరులు కురిపిస్తాయి. ప్రస్తుతం అన్నిరకాల చేపలు కనుమరుగవుతున్నాయి.
కోట్ల రూపాయల ఎగుమతులు మాయం
పశ్చిమ తీర ప్రాంతానికి తూర్పుగోదావరి, కౄష్ణా జిల్లా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మత్స్యకారుల బోట్లు వేట సాగించేవి. రోజుకు సుమారు నాలుగు కోట్ల రూపాయల మత్స్య సంపద ఇక్కడి నుంచి కేరళ, చెన్నై, విశాఖ, నెల్లూరు కేంద్రాలుగా ఎగుమతి అయ్యేవి. వేలాది మంది మత్స్యకారులతో పాటు స్ధానికంగా వందల మందికి రవాణా, ఐస్ ఫ్యాక్టరీల ద్వారా ఉపాధి లభించేది. దశాబ్దాల క్రితం పశ్చిమ తీర ప్రాంతంలో సుమారు 900 బోట్లపై వేట సాగింది. ప్రస్తుతం 300 బోట్లపై మాత్రమే వేట సాగుతోందని, అది కూడా అంతంత మాత్రమేనని మత్స్యకారులు చెబుతున్నారు.
సముద్రంలో మత్స్స సంపద ఏమైంది..?
టన్నుల కొద్దీ లభ్యమయ్యే మత్స్య సంపద ఏమైందని తీర ప్రాంత వాసులతో పాటు ఇతర ప్రాంతాల వారి మదిని తొలుస్తోంది. ప్రధానంగా సముద్ర గర్భం కలుషితం కావడంతో మత్స్య సంపద తరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయిల్ నిక్షేపాల కోసం తవ్వకాలు, పరీక్షలతో మత్స్య సంపద హరించిపోతోంది. ఇటీవల కాలంలో అప్పడప్పుడూ మొగల్తూరు తీరప్రాంతానికి భారీ చేపలు కొట్టకురావడం మత్స్యకారులను ఆందోళనకు గురి చేస్తోంది. తీర ప్రాంతంలో విస్తరించిన ఆక్వా సాగు కూడా సముద్ర జలాలు కలుషితం కావడానికి ఒక కారణం. చెరువుల్లో వినియోగించిన మందులు, మేత తదితర అవశేషాలతో కూడా వ్యర్థ జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, దీనితో సముద్ర జలాల్లో సహజ సిద్ధమైన మత్స్య సంపద నశించిపోతుందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు.
భారంగా మారిన వేట
మత్స్యకారులకు వేట సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. రోజుల తరబడి సముద్రంలో వేట సాగించే వారికి గతంలో కిరోసిన్ అత్యవసరం. ప్రస్తుతం కిరోసిన్ అందుబాటులో లేదు. దశాబ్ద కాలంగా ఆధునిక సాకేంతికతో మరబోట్లు అందుబాటులోకి రావడం మత్స్యకారులకు అనుకూల అంశం. ఇప్పుడు అవే బోట్లు ప్రతికూల అంశం. ఐదేళ్ల క్రితం డీజిల్ ధరలతో పోల్చితే ప్రస్తుతం రెట్టింపు ధర పెరిగింది. మరబోటు వాడకం భారంగా మారింది. వలలు, ఆహారం, నిర్వహణ సామగ్రి, డీజిల్‌తో మత్స్యకారులు ఒక బౄందంగా నెలల తరబడి సముద్రంలో వేటకు వెళ్లడానికి సుమారు 8 లక్షల పెట్టుబడి అవసరమని మత్స్యకారులు చెబుతున్నారు. తగినంత మత్స్య సంపద లభ్యం కాకపోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. అదే సమయంలో ప్రకౄతి వైపరీత్యం సంభవిస్తే ప్రాణం గుప్పెట్లో పెట్టకుని తిరుగుముఖం పట్టాల్సిందే. కాలుష్యాన్ని అరికట్టి సముద్రంలో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది.