ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గా మధ్య మాటల యుద్ధం హీటెక్కిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ రాజకీయం ముసురుకుంది. ఓ సామాజిక వర్గ ఓట్ల కోసమో.. కారణం ఏదైనా..? ఎన్టీఆర్ ను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో వైసీపీ ఉందని రాజకీయ విశ్లషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా పెట్టింది. ఏకంగా ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణాలో ఆయన విగ్రహానికి వైసీపీ రంగులేయడం.. రాజకీయంగా కలకలం రేపింది. కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడం ఘర్షణకు దారి తీసింది. మినీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలోనే ఈ ఘటన జరగడంతో తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇతర నేతలు ఘటనాస్థలిని పరిశీలించారు. తెదేపా కార్యకర్తలు వైకాపా రంగులపై పసుపు రంగు వేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేసారు. కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని… మహానాడు బ్యానర్లపై వైకాపా బ్యానర్లు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. తెదేపా నేతలు వెళ్లిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో బొమ్ములూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కృష్ణా జిల్లా గుడివాడలో మరో రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించనున్న తరుణంలో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు పూయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే మండలంలోని అంగలూరులో నిర్వహించనున్న మినీ మహానాడుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. దీనికి కూతవేటు దూరంలోని బొమ్మలూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రూరల్ సీఐ జయకుమార్ అక్కడికి పోలీసు బలగాలను తరలించారు. పికెట్ ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు- మాజీ మంత్రి కోడాలి నాని
తాజాగా టీడీపీ ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి కొడాలి నాని.ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదని, ఆయన జాతి సంపద అని, ఎన్టీఆర్ ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ నేతలు, చంద్రబాబుపై విమర్శలు చేశారు. ‘‘ఎన్టీఆర్ జాతి సంపద. ఆయన ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చు. ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి? ఆనాడు ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ లెటర్ కూడా తన దగ్గర ఉందన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎవరైనా రావొచ్చు అంటూ సవాల్ విసిరారు. బొమ్మలూరులో తన సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని తానే ఏర్పాటు చేశాను అన్నారు. తన శిలా ఫలకాన్ని తొలగించడంతోనే వివాదం మొదలైందని గుర్తు చేశారు. గుడివాడ నియోజకవర్గం మొత్తం ఎన్టీఆర్, వైఎస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేసి వైసీపీ రంగులు వేయిస్తా. ఎవరేం చేస్తారో చూస్తా అంటూ సవాల్ విసిరారు.
కొడాలి నాని పై బుద్దా వెంకన్న ఫైర్
మాజీ మంత్రి కొడాలి నాని పై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. అప్పుడే కొడాలి నానికి చెమటలు పడుతున్నాయన్నారు. జగన్(Jagan) జైల్లో ఉంటే తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి పాదయాత్ర చేశారని.. అలాంటి వారిని అధికారంలోకి రాగానే ఇంటి నుంచి గెంటేయలేదా? అని ప్రశ్నించారు. వెన్నుపోటుకు, గొడ్డలిపోటుకు పేటెంట్ జగన్ అని విమర్శించారు. ఇంకా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ‘‘కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకో.. సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికించిన చరిత్ర ఎవరిది? అంటే వెన్నుపోటు దారుడు ఎవరో .. కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు. దమ్ముంటే చర్చకు రా… వెన్నుపోటు, గొడ్డలి పోటు ఎవరిదో తేలుద్దాం. కొడాలి నానిని నాడు టీడీపీ నుంచి బయటకు గెంటేశాం. ఎన్టీఆర్‌ను తిట్టిన వైయస్ నీకు దేవుడా? నిన్ను ఎమ్మెల్యేని చేసిన చంద్రబాబు వెన్నుపోటు దారుడా? తల్లి, చెల్లిని పార్టీ నుంచి గెంటేసిన జగన్ వెన్నుపోటుదారుడు కాదా? రేపు గుడివాడ మహానాడుతో కొడాలి నాని పని అయిపోతుంది. నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది… గుడివాడ ప్రజలే తగిన బుద్ది చెబుతారు’’ అని పేర్కొన్నారు.