బాలినేని ఏ పార్టీలో ఉండాలి ఏ పార్టీలోకి అడుగులు వేయాలి అనే విషయం పై ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు అనే విషయంపై ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరిదీ ఇదే ప్రశ్న. సీఎంకి దగ్గర బంధువు ఐన బాలినేనికి వైసీపీలో ఎంత మాత్రం ప్రాధాన్యత లేకపోయేసరికి ఆయన ఎంతో అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మీద హవాలా డబ్బు రవాణా, పేకాట, కెసినో కింగ్ అంటూ ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చేసరికి బాలినేనిని మంత్రి పదవి నుంచి తప్పించారు. జగన్ బాలినేనిని మంత్రి పదవి నుంచి తప్పించి..జిల్లాకు మాత్రం ఆదిమూలపు సురేష్ ని కంటిన్యూ చేస్తుండేసరికి బాలినేని వర్గం కోపంగా ఉంది. తన మంత్రి పోవడానికి బాలినేని బావ టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఐతే ప్రస్తుతం బాలినేని జనసేన వైపు వెళ్లేందుకు మొగ్గు చూపిస్తున్నారని ప్రజల్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఎందుకంటే ఈ మధ్య కాలంలో జనసేన పవన్ కళ్యాణ్ పై బాలినేని చూపిస్తున్న ప్రేమ, సాఫ్ట్ కార్నర్ ప్రజలకు క్లియర్ గా తెలిసిపోతోంది. అలాగే ఆయన ట్విట్టర్ లో పవన్ ఛాలెంజ్ ని కూడా యాక్సెప్ట్ చేసి రిప్లై ఇచ్చేసరికి జనసేన వైపే అంటూ ఒక వర్గం కంఫర్మ్ చేసేసింది. ఐతే జనసేనలోకి వెళ్తారో లేదో కానీ వైసీపీలో తన లెవెల్ ని చూపించుకోవడానికే అన్నట్టుగా ఇలా అటు వైపు నుంచి నరుక్కొస్తున్నారా అనే మరో వాదన కూడా వినిపిస్తోంది. అంతేకాదు ఇటీవల హైదరాబాద్ వెళ్లి తన ముఖ్య అనుచరులతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. వీటన్నిటిలో భాగంగా ఇప్పుడు మరో కొత్త వాదన కూడా తెరపైకి వచ్చింది. సొంత పార్టీలో ఎలాగూ ఆదరణ లభించదని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే డెఫినెట్ గా ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆయన నమ్ముతున్నారని ఆయన వర్గీయులంటున్నారు. ఇక బాలినేని పై వస్తున్న రూమర్స్ గురించి వైసీపీలో కూడా చాలా సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి.
తనపై వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని గట్టిగా చెప్తున్నారు బాలినేని. పవన్ చేస్తున్న మంచి పనికి మద్దత్తు తెలిపాను తప్ప పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతో కాదు అని అన్నారు. నేను ఎప్పటికీ జగన్ తో ఉంటాను. రాజకీయాలు ఉన్నంత కాలం వైసీపీలో ఉంటా లేదంటే రాజీనామా చేస్తా అని ప్రకటించారు.