అతని పేరు ఓ రాగం.. స్వరరాగ గంగాప్రవాహం.ఆయన ఎవరో… మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. మీకు ఈ పాటికే అర్థమై ఉండాలే. ఎస్..ఆయనే ఎం.ఎం.కీరవాణి. 64 ఏళ్ల క్రితం ‘విప్రనారాయణ’ అనే సినిమా విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి జంటగా నటించారు. ఆ సినిమాకు మన కీరవాణిగారి నాన్నగారైన శివశక్తిదత్త వెళ్లారట. ఆ సినిమాలో ఓ పాట ఆయనకు తెగ నచ్చేసిందట. ఆ పాటే… ‘ఎందుకోయీ… తోటమాలీ… అంతులేని యాతనా… ‘. కీరవాణి రాగంలో ఎస్.రాజేశ్వరరావుగారు ఆ పాటను స్వరపరిచారు. ఆ సినిమా చూసినప్పట్నుంచీ.. రోజులు గడుస్తున్నా.. నెలలు గడుస్తునాన్నా.. ఏళ్లు గడుస్తున్నా.. ఆ పాట మాత్రం శివశక్తిదత్తా గారిని వదిలిపెట్టడంలేదట. చివరకు ఆ పాటపై ఆయనకు మమకారం ఏ స్థాయికి చేరుకుందంటే.. ఆ సినిమా వచ్చిన ఏడేళ్లకు శివశక్తిదత్తా గారికి ఓ అబ్బాయి పుడితే…. ఆ బాబుకి ’కీరవాణి‘ అని నామకరణం చేసేశాడు. దానికి కారణం.. తానకు ఇష్టమైన పాట రాగం అదే కాదా.. అందుకు. ఆ విధంగా మన కీరవాణికి ఆ పేరొచ్చిందన్నమాట.
తెలుగు చిత్ర పరిశ్రమలో కీరవాణి.. రామోజీరావు నిర్మించిన ‘మనసు – మమత’ చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మీనా నటించిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాకు స్వరాలు సమకూర్చి గుర్తింపు సంపాదించుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘరానా మొగుడు’ చిత్రం కీరవాణి కెరీర్‌లో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం తర్వాత ఆయన కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. కీరవాణికి ఎన్టీఆర్ నటించిన ‘శ్రీకృష్ణపాండవీయం’ సినిమా అంటే ఎంతో ఇష్టమట. ఎన్టీఆర్ చివరగా నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాకు కూడా ఈయన మ్యూజిక్‌ని అందించారు. నాగార్జున నటించిన ‘అన్నమయ్య’ చిత్రానికి ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు దక్కింది. కొన్ని దశాబ్దాలుగా మ్యూజిక్‌ని అందిస్తున్న కీరవాణి.. తన తమ్ముడు డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే అన్ని చిత్రలకు ఆయనే సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి సిరీస్ 1-2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాల్లోని సంగీతంతో.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.