నిరసన నేడు తీవ్ర రూపం దాల్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. చివరకు కాల్పులకు సైతం దారి తీసింది. ఇది వరకే తెలంగాణలో నాంపల్లి రైల్వేష్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రైల్వేస్టేషన్లకు రప్పించి భద్రతను పెంచుతున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ఏపీలో హై అలర్ట్
ఏపీలోని విజయవాడ సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. గుంటూరు, నరసరావుపేట, విశాఖపట్నం, తిరుపతి, సామర్లకోట, నెల్లూరు రైల్వే స్టేషన్లలో అలెర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్లలో ప్రజలు గుమిగూడకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
స్టేషన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రలోని పలు రైల్వేస్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానమైన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను దించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో అదనపు బలగాలు మోహరించారు. విజయవాడ స్టేషన్ ప్రధాన ద్వారం నుంచి రెండువైపుల ప్రవేశమార్గాల వద్ద భారీ బందోబస్తు మోహరించారు. విజయవాడ డీసీపీ కె.బాబూరావు పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా బృందాలతో రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీలు చేయిస్తున్నారు. విజయవాడతోపాటు గుణదల, రాయనపాడు, మధురానగర్ తదితర రైల్వేస్టేషన్‌లు, లోకోషెడ్ డీఆర్‌ఎం కార్యాలయం తదితర ప్రాంతాల్లోనూ అదనపు బలగాలను ఉంచారు. ఆర్పీఎఫ్ బృందాలు సీసీ కెమెరాలను నిశితంగా పర్యవేక్షిస్తూ భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.తిరుపతి రైల్వే స్టేషన్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ రెండు ప్రవేశ ద్వారాలు మూసివేశారు. స్టేషన్లో భద్రత పెంచారు.
నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వరంగల్ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ వైపు వచ్చే రైళ్లను వరంగల్ స్టేషన్లోనే నిలిపివేశారు. కాజిపేట, మహబూబాబాద్, తదితర స్టేషన్లలో భద్రత పెంచారు.
ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. రైల్వే స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన వేలాది మంది ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు రైళ్లకు నిప్పుపెట్టి అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఆందోళన ఇంకా కొనసాగుతోంది.
తొలుత మొదట మూడు, నాలుగు వందల మంది విద్యార్థులు స్టేషన్ లోకి చొచ్చుకొచ్చారు. ఆ తర్వాత మరింత మంది ఆందోళనకారులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతమంది ఒక్కసారిగా దాడి చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తమ వస్తువులను రైళ్లలోనే వదిలిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు రైల్వే పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దాంతో, అదనపు బలగాలను స్టేషన్లో మోహరించారు. పట్టాలపైకి వచ్చిన ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు తర్వాత గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలైనట్టు సమాచారం. రైల్వే స్టేషన్లో హింస నేపథ్యంలో శుక్రవారం అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఉత్తరాధి రాష్ట్రాల్లో చెలరేగిన అగ్నిపథ్ వివాదం నేడు తెలంగాణలోనూ ప్రభావం చూపుతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో స్టేషన్ బయట సైతం కొన్ని బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అగ్ని పథ్ పథకాన్ని రద్దు చేసి రెగ్యూలర్ గా సైన్యంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నేటి ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు మూడు రైళ్లకు నిప్పుపెట్టారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగడంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. రైల్వే స్టేషన్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌పై మూడో రోజూ ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. బిహార్, ఉత్తర్ప్రదేశ్లలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. తొలుత బిహార్‌లోని లఖీసరాయ్ రైల్వే స్టేషన్, ఉత్తర్ప్రదేశ్లోని బాలియా రైల్వే స్టేషన్ ముందు నిరసన చేపట్టారు ఆందోళనకారులు. కొందరు దుండగులు రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వీరిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
లఖ్మీనియా రైల్వే స్టేషన్కు కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. రైల్వే ట్రాక్‌పై టైర్లు పెట్టి నిప్పుపెట్టారు. అగ్నిపథ్ విధానాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు చేపడతామని, వెనక్కి తగ్గబోమని ఆందోళనకారులు తేల్చి చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ యువతపై పోలీసులు కాల్పులు జరపడాన్ని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
నిరుద్యోగ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ గత 8 ఏళ్లుగా నిరుద్యోగ యువతను మోసం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. అన్నారు. ఇప్పుడు భారత సైన్యంలో 4 ఏళ్ల కాంట్రాక్ట్ పద్ధతి తీసుకువచ్చే విధంగా మోడీ సర్కార్ అగ్నిపధ్ పథకం తీసుకురావటం దుర్మార్గం. భారత సైన్యం ప్రతిష్టను మంటగలిపేలా నరేంద్రమోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అగ్నిపథ్ వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకాయి. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అగ్నిపధ్ పథకాన్ని విరమించాలి.. సికింద్రాబాద్ కాల్పుల్లో మరణించిన నిరుద్యోగి కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు…