ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింది. జీవో 69ను నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి అనుమతిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో 69 ను జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బుక్ మై షో, విజయవాడ డిస్ట్రిబ్యూటర్లు, మల్టీప్లెక్సులు హైకోర్టులో పిటిషన్లు దాఖాలు చేశాయి. రెండు రోజులపాటు వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్లైన్లో విక్రయాలు జరుపుతుందని వెల్లడిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 69ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే టికెట్ల అమ్మకం తర్వాత వచ్చిన ఆదాయాన్ని తిరిగి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో.. ఈ విషయంపై నిర్మాతల మండలి ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినా కూడా ప్రభుత్వం తరపు నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో.. జీవో నెంబర్ 69ను సవాల్ చేస్తూ.. మల్టీప్లెక్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ప్రైవేట్, ఆన్లైన్ విక్రయ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజులుగా ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వ, ఇటు పిటిషన్ దాఖలు చేసిన వారి తరపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసి, జూలై 1వ తేదీన ప్రకటిస్తామని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నో వివాదాలు :
2021 ఏప్రిల్ 9న.. పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అప్పటి వరకూ సినిమా టికెట్ల మీద ఎలాంటి ప్రకటనా చేయని ప్రభుత్వం.. సినిమా విడుదలకు ముందు రోజు రాత్రే హడావిడిగా సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ ఆదేశాలు జారీచేసింది. పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా.. ఏ థియేటర్లో ఎంత ధర వసూలు చేయాలో నిర్దేశించింది. అప్పటి వరకూ కరోనా కారణంగా నెలల తరబడి థియేటర్లు మూసేశారు. అలాంటి పరిస్థితుల్లో.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపై సినీ పరిశ్రమ నుంచి విస్మయం వ్యక్తమైంది. ఈ ధరలకు షోలు వేస్తే గిట్టుబాటు కాదంటూ ఎగ్జిబిటర్లు చేతులు ఎత్తేశారు. ఉన్నట్టుండి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందన్న ప్రశ్నకు.. రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసేందుకే ఇలా చేశారని జనసేన, బీజేపీ నాయకులతోపాటు పవన్ అభిమానులు ఆరోపించారు. అప్పటి నుంచి మొదలైన సినిమా టికెట్ల వివాదం.. టీవీ సీరియల్ మాదిరిగా నెలల తరబడి కొనసాగింది.
ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు అమాంతం తగ్గించడంతో.. థియేటర్లో సినిమా విడుదల చేసేందుకు చాలా కాలంపాటు నిర్మాతలెవరూ ధైర్యం చేయలేకపోయారు. తెలుగు సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారంటూ వార్తలు వచ్చినా.. చాలా కాలంపాటు అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే.. ప్రభుత్వం తానే సినిమా టికెట్లు అమ్ముతానంటూ ప్రకటించింది. ఈ మేరకు జీఓ నెంబర్ 69 కూడా విడుదల చేసింది. ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మడంపై.. ఆది నుంచీ వ్యతిరేకత వ్యక్తమైంది. జనసేనాని పవన్ మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును ఆదాయంగా చూపుతూ.. అప్పులు తెచ్చుకునేందుకు ప్రభుత్వం చూస్తోందని, అందుకే ఆన్ లైన్ విక్రయ విధానాన్ని తెచ్చిందని ఆరోపించారు. ఇలా నలుగుతున్న వివాదంపై.. బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్, ఎగ్జిబిటర్లు కోర్టును ఆశ్రయించారు. . .ఇప్పటికే పలుమార్లు కోర్టులో ఎదురుదెబ్బలు తగిలిన రాష్ట్ర ప్రభుత్వానికి.. తాజాగా సినిమా టికెట్ల విక్రయం విషయంలోనూ చుక్కెదురైంది. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం సహేతుకంగా లేదని కోర్టు చెప్పడంతో.. ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మరి, తుది తీర్పులో న్యాయస్థానం ఏం తీర్పు చెబుతుంది? ఈ విషయంలో సర్కారు ఎలాంటి విధానంలో ముందుకెళ్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.