శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో పుట్టపర్తి ప్రశాంతి నిలయం వేదికగా నిర్వహించే గురు పూర్ణిమ వేడుకలకు ముఖ్యఅతిధిగా విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆహ్వానం అందింది. మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె.రత్నాకర్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధుల బృందం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఈ మేరకు విన్నవించారు.
జులై 13వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి బాబా భక్తులు హాజరుకానున్నారని, ట్రస్టు నేతృత్వంలో బాబా పేరిట నిరాటంకంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గురుపూర్ణమ పర్వదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భవవాన్ శ్రీ సత్య సాయి బాబా భక్తులు సాయి స్మరణతో ఘనంగా జరుపుకుంటారని రత్నాకర్ గవర్నర్ కు వివరించారు. ట్రస్టు నేతృత్వంలో విద్యాసంస్ధలు నిర్వహించటం ఆచరణీయమని ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు. సత్యసాయి ట్రస్టు సేవల పట్ల తనకు అవగాహన ఉందని, గురుపూర్ణిమ వేడుకలకు తప్పనిసరిగా హాజురు అవుతానన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.