పంటలు పండించినా గిట్టుబాటు ధర రానందున క్రాప్ హాలీడే పాటించాలని గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ రైతులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ రైతులంతా స్థానిక కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఏడాది పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రస్తుతం పెసరకు కూడా గిట్టుబాటు ధర లేదని, దీనికితోడు కాల్వలు, డొంకలు అధ్వాన్నంగా ఉండటంతో వ్యవసాయం తలకు మించిన భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
గోదావరి జిల్లాలో 80 శాతం సాగుదారులు వీరే
కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తూర్పుగోదావరి జిల్లా కడియం రైతులు, కౌలుదారులు, కూలీలు ఏటా నష్టాలతో విసిగిపోయామని, ఈసారి తొలి పంట వదిలేస్తున్నామని స్పష్టంచేశారు. వర్షాలు తగ్గాక రబీలో వరి వేస్తే కొంతైనా గట్టెక్కుతామని అంటున్నారు. సొంత భూమి ఉండి సాగు చేసుకుంటున్న వారితో పోల్చితే తామే ఎక్కువగా నష్టపోతున్నామంటూ కౌలుదారులు తమ అనుభవాలను ఏకరవు పెట్టారు. అందుకే జూన్ 1న డెల్టాలో కాల్వలకు నీళ్లొదిలినా ఇప్పటికీ ఆకు మడులు సిద్ధం చేయడం లేదు.
గోదావరి ప్రాంత రైతులు అధిక వర్షాలతో మూడేళ్లుగా నష్టపోతున్నారు. ఏటా రెండు, మూడుసార్లు పొలాలు ముంపునకు గురువుతున్నాయి. గతేడాది నారు మడి దశలోనే వర్షాలు ముంచేశాయి. కొందరు మళ్లీ నారు పోయగా, మరికొందరు దూరప్రాంతాల నుంచి కొనుక్కొచ్చి నాట్లు వేయడం వల్ల ఖర్చు పెరిగింది. నాట్లు పడ్డాక మూణ్నాలుగు వారాల్లో వర్షాలు కురవడంతో వారానికి పైగా నీరు నిలిచి పంట కుళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. మిగిలిన పంటను కాపాడుకునేందుకు ఎరువులు, పురుగు మందుల పిచికారీకి 2 వేల నుంచి 3వేలు అదనంగా ఖర్చు చేశారు.
కోతల సమయంలోనూ వర్షాలతో పంట నేల వాలిపోవడం, మొలకలు రావడం, హార్వెస్టర్, ట్రాక్టర్లకు కిరాయిలు చెల్లించడం భారంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి ఆశిస్తుంటే.. 20 బస్తాలైనా రావడం లేదంటున్నారు. పండించిన ధాన్యంలో తేమ తగ్గించేందుకు కళ్లాల్లో ఆరబెట్టినప్పుడు వానలు కురిసి నష్టపోతున్నారు. తేమ ఎక్కువగా ఉందంటూ 75 కిలోల బస్తాకు వ్యాపారులు 11వందల నుంచి 12 వందల మధ్యే చెల్లిస్తున్నారు.
ఎకరాకు 40 వేల పెట్టుబడి పెట్టినా కౌలుదారులకు ఎలాంటి గుర్తింపూ లేదు. పట్టాదారు పాసుపుస్తకం నకళ్లు ఇవ్వకపోవడంతో… సాగుదారు హక్కు కార్డులు పొందలేకపోతున్నారు. విత్తన రాయితీలు, పెట్టుబడి రాయితీలు, పంటల బీమా అందడం లేదు. అన్నీ భూయజమాని బ్యాంకు ఖాతాల్లోనే జమవుతున్నాయి. పంట అమ్మగా వచ్చిన సొమ్ము కూడా యజమాని ఖాతాలోనే పడుతుంది. అందులోంచి తమకు రావాల్సిన డబ్బులు మినహాయించుకుని మిగిలింది కౌలుదారుకు ఇస్తున్నారు. మద్దతు ధర దక్కక బస్తాపై 250 వరకు నష్టపోతున్నా, చాలాచోట్ల యజమానులు ఆ మేరకు తగ్గించుకోవడం లేదు.