ఆంధ్రప్రదే శ్ లో రోడ్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో రోడ్లు బాగా పాడయ్యాయని.. రోడ్లు వేయండి మహాప్రభో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరీ దారుణంగా మారిపోయాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ఓ కార్టూన్ కౌంటర్ ఇచ్చారు.
— Pawan Kalyan (@PawanKalyan) July 14, 2022
జూన్ 8న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద జనసేన అధినేత పవన్ కల్యాన్ వ్యంగ్యాస్త్రాలు వేశారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదనే అంశం మీద ఓ కార్టూన్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ట్విటర్ లో పోస్ట్ చేశారు. ‘డిగ్రీ, పీజీ కూడా చేశాను. ఏదైనా జాబు ఇమ్మంటే… ఇది ఇచ్చి వెళ్లిపోయాడు’ అంటూ ఒక నిరుద్యోగి తన చేతిలోని జాబ్ క్యాలెండర్ను చూపిస్తున్నట్లుగా ఆ కార్టూన్ లో ఉంది. పట్టభద్రుడు పకోడీలు, పండ్లు అమ్ముకుంటున్నట్లు ఉంది. ఆ పక్కనే సీఎం సెక్యూరిటీ తో వెళ్తున్నట్లు.. ఆయనను ఉద్దేశించి నిరుద్యోగి వ్యాఖ్యానించినట్లుగా చూపించారు. డిగ్రీ చేసి సామాన్లు మోస్తుంటే.. ఒకతను డిగ్రీ చేసి… ఇదేం పనయ్యా.. అని అడుగుతున్నట్టుగా కూడా ఉంది. దీంతో ఇప్పుడీ కార్టూన్ మీద దుమారం రేగుతోంది.
సీఎంను నిద్రలేపేందుకే ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ కార్యక్రమం: నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రహదారుల విషయంలో గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రిని నిద్రలేపేందుకే ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్ (#GoodMorningCMSir)’ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలిలో ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన చేపట్టబోయే కార్యక్రమం గురించి వివరించారు. ‘‘ఏపీలో రహదారులు కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ విషయంలో గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమం. జనసేన అధినతే పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో బాగాలేని రోడ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు డిజిటల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రామాలు, మండలాల రోడ్ల దుస్థితిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రోడ్ల మరమ్మతుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు మళ్లిస్తున్నారు.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. సామాన్యుడి మీద భారం వేసి, పెట్రోల్ మీద ప్రతి ఏటా రూ.750 కోట్ల రోడ్ సెస్ వసూలు చేస్తున్నారు. ఆ సెస్ చూపి రూ.6 వేల కోట్ల అప్పులు తెచ్చారు. ముఖ్యమంత్రికి జవాబుదారీ తనం ఉంటే, ఆ నిధులు దేనికోసం ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను జనసేన తిప్పికొడుతుంది’’ అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
