మెగాస్టార్ చిరంజీవి.. జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీని పైన మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చిరంజీవి ఊసరవెల్లి అంటూ సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యల పైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ వ్యవహారంలో స్పందించారు. నారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కొంత మంది మెగా అభిమాన సంఘాల నేతలు నారాయణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. దీని పైన ఇప్పుడు నాగబాబు ట్వీట్.. నారాయణ స్పందన హాట్ టాపిక్ గా మారాయి.
తప్పు ఎవరు చేసినా సరే.. ఒకసారి క్షమాపణలు కోరితే క్షమించండి మన మెగా జనసైనికుల ధర్మం.
కాబట్టి సీపీఐ నారాయణ పెద్ద వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని మన మెగా జనసైనికులందరినీ కోరుతున్నాను.
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 20, 2022
అన్నం పెట్టండి అంటూ నాగబాబు ట్వీట్
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ ఫై చేసిన కామెంట్స్ పట్ల జనసేన నేత , మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘‘ఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే.. ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు. ‘కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు’ అని నాగబాబు ట్వీట్లు చేశారు.
ఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ
వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుకానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే
ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు..— Naga Babu Konidela (@NagaBabuOffl) July 19, 2022
అసలు నారాయణ ఏమన్నాడంటే..
సీపీఐ నారాయణ జూలై 19 తిరుపతి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిరంజీవిపై విపరీతమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహా విష్కరణకు చిరంజీవి హాజరుకావడాన్ని తప్పుపట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటి వాడని నారాయణ అభివర్ణించారు. చిల్లర బేరగాడు, బ్రోకర్ అంటూ పరుష పదజాలం వాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామరాజుగా నటించి అల్లూరి అసలు ఎలా ఉంటారో పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను ఆ సభకు పిలవకుండా చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని నారాయణ మండిపడ్డారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని నారాయణ అన్నారు. ఇదే సమయంలో తాను గతంలో మెగా బ్రదర్స్ పైన చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. తాను చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన పదాల్లో భాషా దోషంగా భావించాలని సూచించారు. తాను చేసిన వ్యాఖ్యలను చింతిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. మెగా అభిమానులు…కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలను మరిచిపోవాలంటూ కోరారు. తనకు ఫోన్లు వస్తున్నాయని..ఇక, ఈ వివాదం వదిలేయాలని సూచించారు. చిరంజీవి సైతం రాజకీయ నేతగా పని చేసారని.. విమర్శలను స్పోర్టివ్ గా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. వరద సహాయక చర్యల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలం అయ్యారని దుయ్యబట్టారు. వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే పోలవరం వరద వివాదానికి కారణంగా నారాయణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు నారాయణ స్వయంగా తన వ్యాఖ్యలను ఉప సంహరించుకున్నట్లుగా చెప్పటంతో ఈ వివాదం ముగిసిపోయే అవకాశం కనిపిస్తోంది.