ఎంఎస్ఎంఇ ద్వారా పరిశ్రమల ఏర్పాటు
మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి
జిల్లాలో ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందిస్తాం
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
రాష్ట్రంలో కొత్తవలస వద్ద ఏర్పాటుచేయనున్న ఉమెన్ ఇండస్ట్రియల్ పార్కుకు సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా వచ్చే నెలలో శంకుస్థాపన చేయించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి చెప్పారు. ఈ పార్కులో పరిశ్రమలను స్థాపించేందుకు మహిళా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఇ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇది కార్యరూపం దాలిస్తే, సుమారు 90 శాతం వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉందని, ఇది పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో డిఐఈపిసి (ది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ & ఎక్స్‌పోర్ట్ ప్రొమోషన్ కమిటీ) సమావేశం శనివారం జరిగింది. జిల్లాలో మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలు, పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ఉన్న అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అందిపుచ్చుకొనేవిధంగా, ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయాధారిత పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన వనరులన్నీ మనవద్ద సిద్దంగా ఉన్నాయన్నారు. మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు, నువ్వుల నూనె, ఇతర నూనెగింజల పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉందన్నారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో ఇటీవలే నువ్వులు వేయడం జరిగిందని, నువ్వుల నూనె పరిశ్రమను ఏర్పాటుచేయడం ద్వారా, ఇటు రైతులకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. నాణ్యమైన మామిడి తాండ్ర ఉత్పత్తి జరుగుతోందని, దానిని అందంగా ప్యాకింగ్ చేసి, మార్కెట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మంచి ప్యాకింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకొనేందుకు టిటిడి ముందుకు వచ్చిందని, ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. ప్రతిపాదిత మహిళా పారిశ్రామిక వాడలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమలను స్థాపించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ముందుకు వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తలను కలెక్టర్ అభినందించారు. ఇప్పటికే సుమారు 150 ఎకరాల్లో ఈ పార్కును ప్రతిపాదించామని, ఎక్కువ మంది ముందుకొచ్చినా అదనంగా స్థలాన్ని కేటాయించేందుకు సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎక్కువగా జరుగుతోందని, ఈ ఉత్పత్తులను మార్కెట్ చేసే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని చెప్పారు. ఔషద మొక్కల యూనిట్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎప్పటినుంచో ప్రతిపాదనల్లో ఉన్న ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనికి పారిశ్రామికవేత్తలంతా సహకారం అందించాలని కోరారు. అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆగస్టు 12 నుంచి 15 వరకు జరిగే తిరంగా ఉత్సవ్‌లో, ప్రతీ పరిశ్రమలోనూ తప్పనిసరిగా జాతీయ జెండాను ఎగురవేయాలని, సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసి, ప్రతీ ఒక్క ఉద్యోగి, కార్మికుడి చేతా సెల్ఫీ తీయించి పంపించాలని కలెక్టర్ సూచించారు.బ్ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణప్రసాద్, సభ్యులు జి.సాంబశివరావు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ పాపారావు, డిడి నాగేశ్వర్రావు, వివిధ శాఖల అధికారులు, పలు సంస్థలు, అసోసియేషన్ల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు పాల్గొన్నారు.