దేశంలో ప్రస్తుతం రాజకీయాలు పాడైపోయాయని బీజేపీ వల్ల డబ్బు రాజకీయమే నడుస్తోందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు.
సోమవారం ‘కొండా’ సినిమా ప్రమోషన్ భాగంగా విజయవాడ వచ్చిన కొండా సురేఖ విజయవాడలోని కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహం నుంచే కొండా సినిమా ప్రమోషన్‌ను ప్రారంభించారు.
అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కొండా సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చాము. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి ఏపీలో టూర్ ప్రారంభించాం. వైఎస్సార్ వల్లే మేము ఇలా ఉన్నాం. వైఎస్సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ప్రస్తుతం రాజకీయాలు పాడైపోయాయి. రాజకీయాలకు అతీతంగా నేను సినిమా గురించే మాట్లాడుతున్నాను.
వైఎస్సార్ అభిమానిగా ఎప్పటికీ ఉంటాను. నేను కాంగ్రెస్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. మా లవ్ స్టొరీ, నక్సల్స్ జీవితం, రాజకీయ జీవితంపై సినిమా ఉంటుంది. ఆరోజు ఉన్న నక్సల్స్ ఉండి ఉంటే ఈరోజు టీఆర్ఎస్ నాయకులు బయటకు వచ్చేవారు కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను టీఆర్ఎస్ వెనక్కి తీసుకుందని’ మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు