విజయనగరం : జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన రోడ్ షో విజయవంతం కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం తాండవిస్తోంది. రోడ్ షోకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో జిల్లా నాయకత్వంలో ఆనందం వెల్లివిరుస్తోంది. వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత టీడీపీ క్యాడర్ పూర్తిగా నిస్తేజమైంది. ఎక్కడైనా ఏదన్నా ఉద్యమం చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండడంతో ఎందుకొచ్చిన బాధ… ఎన్నికల ముందు చూసుకోవచ్చులే అనుకుంటూ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రోదిగొంటున్న తరుణంలో మళ్లీ టీడీపీ నాయకుల్లో ధైర్యం వచ్చింది. నిరంతరం ఏదో ఒక అంశం మీద పోరాటమో, ఆందోళనో, ధర్నా ఇలా చేపడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు చేపట్టిన రోడ్ షో పార్టీకి మంచి బలాన్నిచ్చిందని చెప్పాలి.
శుక్రవారం నాటి యాత్ర విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసింది. అయితే విజయనగరంలో అసెంబ్లీ సీటు కోసం అశోక్ గజపతి కుటుంబంలోని వ్యక్తి మాత్రమే పోటీలో ఉంటారు. అంటే ఆయన కానీ, కుమార్తె అదితి గజపతికానీ బరిలో ఉంటారు. ఇక చీపురుపల్లిలో అయితే మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు. ప్రస్తుత పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అయిన నాగార్జునకే అ వకాశాలు ఎక్కువ. ఈయన 2019లో కూడా పోటీ చేసి సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు. అయినా ఇప్పటికీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటూ కార్యకర్తల కష్టసుఖాల్లో నిత్యం తోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇక మిగిలిన నెల్లిమర్ల మాత్రమే కాస్త తిరకాసుగా
ఉంది.
జిల్లాలోని మిగతా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి వేరు. నెల్లిమర్లలో వేరుగా ఉంది. ఈ నియోజకవర్గం జాతీయ రహదారి-16కి అనుకుని ఉండడం దీనికి అనుకూలమైన అంశం. ఇందులోని నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాలు ఉన్నాయి. దాదాపుగా ఈ నాలుగు మండలాలనూ జాతీయ రహదారి టచ్ చేస్తూ వెళుతుంది. దీంతో ఇక్కడ భూముల రేట్లు భారీగా ఉండడమే కాకుండా రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ కూడా ఎక్కువే ఉంటాయి. దీనికితోడు భోగాపురం ఎయిర్పోర్టు, దాని చుట్టూ జరిగే వ వ్యవహారాలూ అధికమే. ఈ నేపథ్యంలో నాయకులకు, వ్యాపారులకు ఆదయమార్గాలూ ఎక్కువే. దీంతోభారీగా ఖర్చు చేసేందుకు సైతం నాయకులు వె సుకాడడం లేదు. గతంలో పతివాడ నియోజకవర్గంగా ఉండే ఈ ప్రాంతం నుంచి టీడీపీ తరఫున పతివాడ నారాయణస్వామినాయుడు ఆరుసార్లు గెలుపొందారు. మంత్రిగానూ చేశారు. అయితే 2019లో మాత్రం వైఎస్సార్ సీపీ నుంచి బడ్డుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకత ఉండడంతో టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించేవారు బాగానే ఉన్నారు.
భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు మొదటి నుంచీ యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఖర్చుకు వెనుకాడని ఈయన పార్టీ టిక్కె ‘ట్ రేసులో ఉన్నారు. ఇంకా కడగల ఆనంద్ కుమార్, రియల్టర్, బిల్డర్ కూడా టిక్కెట్ బరిలో ఉన్నారు. పైస్థాయిలో పరిచయాలున్న ఈ యువకుడు సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీపీ వనజాక్షి సైతం టిక్కెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధం అంటునన్నారు. డెంకాడ నుంచి మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, పూసపాటిరేగ నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు కుటుంబం నుంచి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో ఒకర్ని మించిన ఒకరన్నట్లుగా పోటీ ఉన్న ఈ తరుణంలో అధినేత ఆశీస్సులు ఎ. వరికి ఉన్నాయన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.
రోడ్డు ప్రమాద బాధితులను దగ్గరుండి ఆస్పత్రికి తరలించిన చంద్రబాబు
చీపురుపల్లి మండలం పుర్రేయవలస జంక్షన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో చీపురుపల్లిలో రోడ్ షో ముగించుకుని అటువైపు వస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వాహనం దిగి క్షతగాత్రులకి సహాయక చర్యలు చేపట్టారు. తన కాన్యాయ్‌లోని అంబులెన్సులో విజయనగరం తరలించారు. చీపురుపల్లి మండలం పుర్రేయవలస జంక్షన్‌లో శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వెళ్తూ, తమ ముందు వెళ్తున్న రిక్షాను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలై, రోడ్డుపై పడిపోయారు. అక్కడున్న వారు 108 వాహనానికి సమాచారం అందజేసినప్పటికీ, వాహనం రావడం ఆలస్యమయింది. ఇంతలో ఆ మార్గంలో విశాఖఎయిర్ పోర్టుకు వెళ్తున్న చంద్రబాబు ఘటన స్థలంలో కాన్వాయ్ నుంచి కిందికి దిగి, క్షతగాత్రులను తన కాన్యాయ్‌లో ఉన్న అంబులెన్సు ద్వారా విజయనగరం తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.