ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలుచేస్తూ స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి (శేషు) తెలిపారు. విదేశీ విద్యను అభ్యసించే అర్హులైన వాళ్ల కోసం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’పై జీవో నెంబర్ 39ను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. మెరిట్ స్టూడెంట్స్, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కాపు నేస్తం పథకంతో పాటు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన రియల్ హీరో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అని ఆయన తెలిపారు.
చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే కోవిడ్ మహామ్మారి ప్రపంచాన్ని గడగడలాడిందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా కాలంలో భయభ్రాంతులకు గురయ్యాయని ఛైర్మన్ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అందజేసిన ‘నవరత్నాలు’ పథకాల ఆర్థిక చేయూతతోనే పేద ప్రజలు జీవించిన పరిస్థితులున్నాయన్నారు. ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో, చేస్తున్న మంచి కార్యక్రమాలతో రానున్న రోజుల్లో కూడా జగనే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేసే పథకాల్లో ఏమైనా తప్పులుంటే చెప్పాలని కానీ పథకాలే తప్పు అని ప్రతిపక్షాలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. వాస్తవాలను ప్రజలకు చెబితే ‘నాయకుడు’ అవుతారని, కానీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే వారు క్యారెక్టర్ అర్టిస్టులవుతారే తప్ప నిజమైన హీరోలు కాలేరని.. జగన్ మోహన్ రెడ్డి రియల్ హీరో అని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ ఒక్కరూ వేలెత్తి చూపే పరిస్థితులు లేవని.. ప్రతిపక్షాలు కావాలనే కులాల ప్రస్తావన పదే పదే తీసుకువస్తున్నాయని అడపా శేషు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో కుల, మత, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. కాపు సామాజికవర్గంపై ప్రతి ఒక్కరూ మాట్లాడటం సరికాదని, కాపు కార్పోరేషన్ ను నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని తెలిపారు. 2014 నుండి 2017 వరకూ కార్పోరేషన్ కు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. గతంలో కాపులపై దాడులు జరిగినప్పుడు, ముద్రగడను అవమానించినప్పుడు ఇప్పుడు ప్రశ్నించేవారంతా అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గం గురించి అప్పుడు, ఇప్పుడు ఆలోచనలు చేస్తుంది వై.ఎస్. కుటుంబమే అన్నారు. కాపునేస్తం ద్వారా సంవత్సరానికి రూ.500 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 2,500 కోట్లు కేటాయించి, అమలు చేస్తున్నది ఈ ప్రభుత్వమే అన్నారు. కాపులందరూ ముఖ్యమంత్రి జగన్ కు తోడ్పాటు ఇవ్వాలని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు కోరారు.
గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్య అమల్లో జరిగిన అక్రమాలను, లోపాలను విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్ మెంట్‌విభాగం గుర్తించిందని అడపా శేషు తెలిపారు. 2016 –17 నుంచి విదేశీ విద్య క్రింద చెల్లించాల్సిన రూ.318 కోట్లను గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిందన్నారు. జన్మభూమి కమిటీ సిఫారసులతో డబ్బులున్న వారినే ‘విదేశీ విద్యా దీవెన’విదేశాలకు పంపారన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితులు పాటించలేదని, ఒకే కుటుంబంలో ఒకరికి అంతకంటే ఎక్కువమందికి పథకం వర్తింపజేసి నిజమైన అర్హులను విదేశీ విద్యకు దూరం చేశారని ఆరోపించారు. విజిలెన్స్ విచారణ భాగంగా ఈ పథకంలో లబ్ధి పొందిన వారిలో 200 మంది వివరాలు ట్రేస్ అవ్వడం లేదని తెలిపారు. తాజాగా విడుదలైన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ జీవో ప్రకారం.. క్యూఎస్ ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ఇకపై ఈ ప్రభుత్వమే భరించనుందని తెలిపారు. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని, 101-200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని తెలిపారు. అర్హతల విషయంలో ఏపీలో స్థానికుడై ఉండాలని, ఆదాయ పరిమితి రూ.8 లక్షల వరకూ గల కుటుంబాలలో ఒక్కరికి మాత్రమే జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తించనుందని తెలిపారు. ఏడాదిలో నాలుగు విడతలుగా ఈ సాయాన్ని ప్రభుత్వం అందజేయనుందని తెలిపారు.