సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు తుది శ్వాస విడుస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసందే. ఆ తర్వాత ప్రముఖ సీనియర్ ఫిల్మ్ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూశారు. అదే రోజున ఆర్.నారాయణమూర్తి తల్లి కూడా మరణించింది. అటు హాలీవుడ్ లోనూ ‘గాడ్ ఫాదర్’ నటుడు జేమ్స్ కేన్ కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన వరుసగా చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలన్నింటిని మరవక ముందే చిత్రసీమలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మలయాళ నటుడు, చిత్ర నిర్మాత ప్రతాప్ పోతేన్ ఈ రోజు ఉదయం కన్నమూశారు. 69 ఏండ్ల వయసులో ఆయన చెన్నైలోని తన అపార్ట్‌మెంట్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలియగానే సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడికి ప్రార్థిస్తున్నారు. ప్రతాప్ పోతేన్ 1951 ఆగస్టు 13న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి కలిన ఈయన సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.
దర్శకుడు భరతన్ డైరెక్షన్ లో 1978లో వచ్చిన ‘ఆరవం’ సినిమాతో అరంగేట్రం చేశాడు ప్రతాప్. థకారం, ఆరోహణం, పన్నీర్ పుష్పంగల్, తన్మాత్ర వంటి అతని ప్రసిద్ధ మలయాళ చిత్రాలలో నటించారు. అలాగే 100కు పైగా మలయాళం, తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించారు. ప్రతాప్ పోతేన్ మలయాళంలో మూడు చిత్రాలు రితుభేదం, డైసీ మరియు ఒరు యాత్రమొళికి డైరెక్షన్ చేశారు. యాక్టర్ గా, ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా, డైరెక్టర్ గా సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. మొదటి వివాహం భార్య సీనియర్ యాక్ట్రెస్ రాధిక శరత్ కుమార్తో 1985లో జరిగింది. తర్వాత ఏడాదికే వీరు వీడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అమలా సత్యనాథ్ ను 1990లో పెళ్లి చేసుకుని 2012లో డివోర్స్ ఇచ్చారు. ఈయనకు కూతురు కేయా పోతేన్ ఉన్నారు. ఈమె సింగర్ గా, మ్యూజిషియన్ గా కేరీర్ కొనసాగిస్తోంది.