రాజ్యసభలో తెలంగాణ గొంతుకను బలంగా వినిపిస్తానని ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికైనప్పటికీ సొంత రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. తెరాస సర్కారు అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగడం లేదని, పుత్రవాత్సల్యం తెలంగాణ ప్రజలకు భారంగా మారిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. మోదీ ఆకాంక్ష మేరకు తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పాలనకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించే విధంగా పాలన సాగిస్తామన్నారు. ఇదే తరహా పాలన కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి రాజకీయ దాడులనైనా ఎదుర్కొని ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగిస్తామన్నారు.