కేశినేని నాని రూటు మార్చారు.. కాదు ప్లేటు ఫిరాయించారు.. కాదు కాదు మైండ్ మార్చుకున్నారు. ఏది ఏమైనా నాని గారు ఎందుకో తగ్గారు,తగ్గి నెగ్గాలనుకుంటున్నారో ఏమో గాని వెనక్కు తగ్గారు. మొన్నటిదాకా ట్విట్టర్ లోనే పేలాలు వేయించిన నాని ఇప్పుడు అసలు నేను అసంతృప్తిగా ఉన్నానని ఎవడు చెప్పాడు మీకు అంటూ ఎదురు ప్రశ్నించేసరికి జర్నలిస్టులకు మైండ్ పోయింది. ఇదేంటి సామీ ట్విట్టర్ లో పెట్టిందే నువ్వే కదా అంటే నీకు చెప్పానా? నీ దగ్గర వీడియో ఉందా అంటూ ఫైరయ్యారు. చంద్రబాబుకు బొకే ఇవ్వలేదు కదా తోసేశారు కదా అంటే అసలు ఆ వీడియో నీకు ఎవరిచ్చారు?నువ్వు తీశావా అంటూ మరో ప్రశ్న. దీంతో అందరికీ బోధపడింది సార్ ఫ్లాష్ బ్యాక్ మర్చిపొమ్మంటున్నాడు మళ్లీ తాను టీడీపీయే జై చంద్రబాబు అంటున్నాడని.అవును కేశినేని నానికి తెలిసొచ్చిందో..లేక తెలివొచ్చిందో తెలియదు గాని.. టీడీపీలో కంటిన్యూ అయి ఇక హైకమాండ్ తో కోఆర్డినేట్ చేసుకుని పని చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే తనకెలాంటి అసంతృప్తి లేదని తానెప్పుడూ అధిష్టానంపై ఏమీ అనలేదంటూ చాలా కోపంగా చెప్పారు. దీంతో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నాని దెబ్బకు విజయవాడను తెలుగుదేశం కోల్పోతుందేమోనని భయపడినవాళ్లంతా హమ్మయ్య అనుకున్నారు.
అయితే కేశినేని నాని ఎందుకు తన మనసు మార్చుకున్నారు? ఇప్పుడు ఈ చర్చ మొదలైంది. మొదటి నుంచి చిటపటా అంటున్న కేశినేని నాని ఎందుకు వెనక్కు తగ్గారు? అంటే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులే కారణమని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. టీడీపీకి అనుకూలంగా మారుతుందని ఈసారి అధికారంలోకి వస్తామని పైగా జనసేన, బిజెపిలు కూడా కలుస్తున్నాయని కాబట్టి గెలుపు గ్యారంటీ అని అందుకే అనవసరంగా ఇప్పుడు తెగదెంపులు చేసుకుని తీరా టీడీపీ అధికారంలోకి వచ్చాక దిక్కులు చూడాల్సి వస్తుందని ముందే అర్ధం చేసుకున్న కేశినేని నాని తన మనసు మార్చుకున్నారని చెప్పుకుంటున్నారు.ఒకవేళ వైసీపీలోకి వెళ్లాలన్నాకేశినేని నాని మెంటాలిటీకి జగన్ మెంటాలిటీకి అస్సలు సెట్ కాదు. ఇప్పుడు వైసీపీ నేతల్లా ఈయన సర్దుకుపోలేరు. ప్రజారాజ్యంలో జాయిన్ అయినప్పుడు కొన్ని రోజుల్లోనే అలిగేసి గొడవపడి బయటకు వచ్చేశారు. తెలుగుదేశంలో ఉన్నంతకాలం ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక నేతతో తగాదా కామన్ అయిపోయింది. అవసరమైతే హైకమాండ్ ను కూడా ఎదిరించి మాట్లాడటం ఆయనకు అలవాటు. అలాంటి మనిషి వైసీపీలోకి వెళ్లలేరు. బిజెపిలోకి వెళదామనుకున్న ఏపీలో ఆ పార్టీకి అంత సీన్ లేదు. అందుకే కేశినేని నాని టీడీపీలో కొనసాగడమే మేలనుకుని అలాగే కంటిన్యూ అయిపోతున్నారని చెప్పుకుంటున్నారు.