పశ్చిమ గోదావరి : పిల్లలకు చదువు ఎలా..? వారి భవిష్యత్ ఏమిటి..? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండల పరిధిలోని కొల్లేరు సమీప గ్రామ పరిధిలోని కళింగగూడెం గ్రామస్తుల ఆవేదన ఇది. ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల తరలించడానికి నిర్ణయించడంతో గ్రామస్తుల ఆందోళన ఫలితంగా ప్రాథమికోన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేశారు. తాజాగా మండలంలోని సిద్ధాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీనితో పాఠశాల తరలించి మా పిల్లల భవిష్యత్ను నాశనం చేయొద్దు అంటూ విద్యార్థల తల్లి దండ్రులు చేతులు జోడించి మరీ వేడుకుంటున్నారు. కళింగగూడెం గ్రామ సర్పంచ్ కూడా మహిళలు, విద్యార్థలు తల్లిదండ్రులతో కలిసి పాఠశాల వద్ద చేతులు జోడించి నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
మూడు కిలో మీటర్ల దూరంలోని పాఠశాలకు
కొల్లేరు తీర గ్రామాలలోని బలహీనవర్గాల పిల్లలు సుమారు 257 కళింగగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉండగా 6, 7 తరగతుల్లో 70 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలను సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని సిద్ధాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఫలితంగా అధికారులు స్పందించి ప్రాథమిక పాఠశాలను, ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చారు. ఇటీవల గా 6, 7 తరగతులను సిద్ధాపురం జడ్పీ ఉన్నత పాఠశాల లో విలీనం చేస్తామని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హతాశులయ్యారు. సిద్ధాపురం పాఠశాల రహదారిలో భారీ గోడౌన్స్ ఉన్నాయని, ప్రతీ రోజు పెద్ద పెద్ద లారీల్లో లోడు దిగుమతి చేయడానికి గోడౌన్ల వద్ద రద్దీ ఉంటుందని, వాహనాల రాకపోకలతో పిల్లలు ప్రమాదాల బారిన అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 3 కిలో మీటర్ల దూరం వెళ్లి, 3 కిలో మీటర్లు తిరిగి వచ్చి ఎలా చదువుకోగలరని వాపోతున్నారు. ఈ నిర్ణయం తమ పిల్లల భవిష్యత్ను నాశనం చేయడమేనని, పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.