ఏపీలో వైసీపీ జోరు పెంచింది. ఇప్పటికే మంత్రుల బస్సుయాత్ర, ఇంటింటికి వైసీపీతో ప్రజల్లోకి వెళ్తోంది. తాజాగా పార్టీ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలయ్యింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ప్లీనరీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. వచ్చే నెల 8,9 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న ప్రాంగణంలో ప్లీనరీ సమావేశం ఏర్పాటుచేయనున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తీర్మానాలు చేయనున్నారు. ఈసందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్లీనరీ సన్నాహక సమావేశాల్లో భాగంగా అన్ని నియోజవర్గాల్లో సమావేశాలు ఏర్పాటుచేయనున్నారు. ఈ నెల 23 నుంచి 28 వరకు వీటిని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలను ఈ నెల 29,30, జులై 1వ తేదీల్లో ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి నుండే వచ్చే ఎన్నికల పై కసరత్తులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. ఇందులో భాగంగా నియోజకవర్గస్థాయిలో ప్లీనరీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా చోట్ల ప్లీనరీ సభలో రసాభాస జరగడం గాని, ప్లీనరీ జనాలు లేక బోసిపోయిన చిత్రాలే ఎ
క్కువగా కనిపిస్తున్నాయి.
తణుకు
అధికార వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీని వచ్చే నెల జూలై 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నియోజకవర్గస్థాయిలో ప్లీనరీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమురుని వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్లీనరీ సన్నాహాక సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదంటూ వైసీపీకే చెందిన తణుకు యూత్ అధ్యక్షుడు మట్టా వెంకట్ మంత్రిని నిలదీయడంలో ప్లీనరీ రసాభాసగా మారింది. వెంటనే పోలీసులు వెంకటేశ్ ను ప్లీనరీ సమావేశం నుండి బయటకు తీసుకువచ్చారు.
ఇదేనా న్యాయం…?
పౌర సరఫరాలశాఖ మంత్రి శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి సొంత నియోజకవర్గం (తణుకు )లో జరుగుతున్న ప్లీనరీ సమావేశానికి మొదటినుంచి వైసీపీ కోసం, కారుమూరి నాగేశ్వరరావు గారి గెలుపు కోసం కష్టపడ్డ నాయకులని, కార్యకర్తలను ఎందుకు పిలవలేదు అని వైస్సార్సీపీ తణుకు నియోజక వర్గ యూత్ ప్రెసిడెంట్ మట్టా వెంకట్ అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అక్రమంగా తణుకు పోలీసులు లాక్కుంటూ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది..ఇదేనా న్యాయం అని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు నిర్వహించిన ప్లీనరీ జనాలు లేక బోసిపోయింది. ఈ సమావేశంలో ఆహ్వానితుల కోసం వేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పాల్గొంటారని ప్రకటించారు. కానీ, వారు రాలేదు. దీంతో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదా్‌సతోనే సభను ‘మమ’ అనిపించారు. కాగా, ధర్మాన ప్రసంగం ప్రారంభం కాక ముందే ప్లీనరీకి వచ్చిన మహిళలు వెనుదిరిగారు. ఎంత నచ్చజెప్పినా.. ‘మీ ప్రసంగాలకోదండం’ అంటూ వెళ్లిపోయారు. దీంతో సభ ముందు కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి. ఈ పరిస్థితిని చూసిన నేతలు అవాక్కయ్యారు.
అనంతపురం
అనంతపురం నగర శివారులోని శిల్పారామంలో వైసీపీ అనంతపురం నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. వైపీసీ ప్లీనరీ సమావేశం అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. సభ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. సమావేశం ఆరంభమైన అరగంటకే కుర్చీలు ఖాళీ అవ్వడం మొదలయ్యింది. అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి జిల్లా ప్లీనరీ పరిశీలకులు ఎస్‌వీ మోహనరెడ్డి హాజరయ్యారు.
ఆలస్యంగా ప్రారంభం ఉదయం 9.30గంటలకు ప్రారంభం కావాల్సిన ప్లీనరీ 11.15గంటలకు ప్రారంభించారు. ఇది కూడా కేవలం సభ నిండలేదనే ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సంక్షేమ పథకాల రథం విరామం లేకుండా పరుగుతీస్తోందన్నారు. ప్రజాక్షేత్రంలో వైసీపీని ఎదుర్కొనే దమ్ములేని టీడీపీ ఇతర పార్టీలు కుట్రలు పన్నుతున్నారన్నారు. వాటిని లెక్క చేయకుండా సీఎం జగన రాషా్ట్రన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు.
నాయకుల మధ్య వాగ్వాదం
అహుడా చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్, వైసీపీ నగరాధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో మాట్లాడటానికి అహుడా చైర్మన ఆహ్వానించారు. అందుకు ఆయన మాట్లాడనని చెప్పారు. కొంతసేపటి తరువాత ఎస్వీ మోహనరెడ్డి మాట్లాడాలని కోరితే… మహాలక్ష్మి నేను మాట్లాడతానని ముందుకొచ్చారు. దీంతో సోమశేఖర్‌రెడ్డి మైక్ తీసుకుని అప్పుడు మాట్లాడనన్నారు… ఇప్పుడు మాట్లాడుతానంటున్నారు అని ప్రశ్నించారు. సోమశేఖర్‌రెడ్డిని ఉద్దేశించి మహాలక్ష్మి మాట్లాడుతూ… పద్ధతి మార్చుకోవాలన్నారు. అహుడా చైర్మన మాట్లాడుతారని చెప్పాలి కానీ చెవిలో వచ్చి మాట్లాడతావా..?అని అడగడం సరికాదన్నారు.
అరగంటకే కుర్చీలు ఖాళీ
ప్లీనరీ ఆరంభమైన అరగంటకే కుర్చీలు ఖాళీ అయ్యాయి. పార్టీ ముఖ్యనేతలు మాట్లాడుతున్న సమయంలో సమావేశానికి వచ్చినవారు వెనుదిరగడం కనిపించింది. చివరికి వేదికపై ఉన్న ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, సర్పంచులను సైతం కిందకు దిగి ఖాళీ అయిన కుర్చీల్లో కూర్చోమని చెప్పాల్సి వచ్చింది.