శాకంబరీ దేవిగా దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. విజయవాడ చిట్టినగర్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నగరంలో విడవకుండా వర్షం పడుతున్నా మంగళవారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు శ్రీ మహాలక్ష్మి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో కరువు కాటకాలు లేకుండా పంటలు బాగా పండేలా శాకంబరీ దేవి రూపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. అమ్మవారికి అలంకరించిన కాయగూరలతో కదంబం వండి భక్తులకు ప్రసాదంగా అందజేసినట్లు వారు వివరించారు.
శాకంబరి ఉత్సవాల సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కాయగూరలతో కన్నుల పండుగగా అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారిని, దేవాలయ ప్రాంగణాన్ని అలంకరించేందుకు ఇప్పటికే పలువురు భక్తులు కూరగాయలను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాయగూరలు, ఆకుకూరలతో అమ్మవారి ప్రాంగణం అందంగా ముస్తాబైంది. శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా జగన్మాత సన్నిధి హరితశోభను సంతరించుకుంది. భక్తులు విరాళాలుగా అందించిన కూరగాయలతో అమ్మవారి ఆలయంతోపాటు ఇతర ఉపాలయాలను అలంకరించారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 43 టన్నులకు మించి కాయగూరలు, ఆకుకూరలు ఇంద్రకీలాద్రికి చేరాయి.