తిరుపతి : ఏపీలో ఇటీవల క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆస్తి గొడవలు కారణంగా, కట్నం చాలలేదని, ఒంటరి మహిళల మీద తెగబడడం వంటివి రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తిరుపతిలో ఇటీవలి కాలంలో చూసుకుంటే నిన్న ఒక ఇంటి స్థలం విషయంలో వివాదం జరిగి సొంత చిన్నాన్న చేతిలో ఒక మహిళ నడిరోడ్డు మీద హత్యకు గురయ్యింది. అందరూ చూస్తుండగానే వేటకొడవలితో విచక్షణారహితంగా సొంత అన్న కూతురినే నరికి చంపాడు. చుట్టూ జనం చూస్తూ ఫోటోలు తీస్తున్నారు తప్పు ఆ దారుణాన్ని ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు.
ఏప్రిల్ లో విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో ఒక మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారానికి కొందరు ప్రయత్నించారు. తర్వాత గురజాల రైల్వే స్టేషన్ దగ్గర ఒడిస్సాకు చెందిన మహిళపై గ్యాంగ్ రేప్, దుగ్గిరాలలో ఒక వివాహితపై అత్యాచారం, హత్య జరిగింది.
రేపల్లె రైల్వేస్టేషన్ లో వలసకూలి మహిళ పై సామూహిక అత్యాచారం ఇలా ఎన్నో జరిగాయి జరుగుతూనే ఉన్నాయి. మొన్న తెలంగాణలో ప్రజాప్రతినిధి కొడుకు తన స్నేహితులతో కలిసి కారులో సామూహిక అత్యాచారం గత నెలలో తిరుపతిలో మైనారిటీ కులానికి చెందిన 14 ఏళ్ళ బాలికను గర్భవతిని చేసిన ఘటన. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో వున్నాయి.
ఇంతకీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు ప్రకారం 2019 నుంచి గుంటూరు, విజయవాడ, కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో అత్యాచారాలు, హత్యల కేసుల వివరాలు పరిశీలిస్తే కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2020 లో కరోనా కారణంగా సంపూర్ణ లాక్ డౌన్ అమలుచేసిన టైంలో కూడా మహిళల పై వేధింపులు, గృహహింస, గ్యాంగ్ రేప్ ల కేసులు బాగా పెరిగాయి. దీన్నిబట్టి చూస్తుంటే గతంలో కన్నా ఇప్పటికి అత్యాచారం, హత్యల కేసులు పెరిగాయని స్పష్టంగా అర్థమౌతోంది. ఎన్బీఆర్బీ నివేదిక ప్రకారం ఏపీలో 2019 లో 1084 అత్యాచార కేసులు నమోదయ్యాయి. లైంగిక దాడులకు గురైన మహిళల సంఖ్య 1104 మంది అని గణాంకాలు చెప్తున్నాయి. ఈ కేసుల సంఖ్య కూడా 2020 నాటికి 1090 పెరిగాయి, 2021 నాటికి 1100 దాటినట్టు పోలీస్ అధికారులు చెప్తున్నారు.
దిశ చట్టం ఏమయ్యింది ?
ఆంద్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019 ఏపి దిశ యాక్ట్ పేరుతో అసెంబ్లీలో ఆమోదం పొంది మూడేళ్లు కావస్తోంది. దిశా చట్టం ఉన్నా నేరాల సంఖ్య ఎందుకు తగ్గడం లేదు అని ప్రజలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభిప్రాయం కొత్త చట్టాల పేరుతో ప్రభుత్వం హడావిడి చేయడం కన్నా ఉన్న చట్టాలనే పకడ్బందీగా అమలుచేయడం పై దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి సరిపడినంత సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. బడాబాబుల ప్రజాప్రతినిధుల పిల్లలు నిందితులైతే ఒకలా పెద్దవాళ్ళైతే మరోలా చూడకుండా నిందితుడు ఎవరైనా సరే విచారించి శిక్ష పడేలా చేయాలని అలాగే పెరుగుతున్న నేరాలను అదుపుచేసేలా టెక్నాలజీ వినియోగం కూడా పెరగాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.