కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో ప్రచారం చేసుకుంటోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన విజయవాడలో భాజపా శక్తి కేంద్ర ప్రముఖ్‌ల సమ్మేళనంలో మాట్లాడారు. నడ్డా హిందీ ప్రసంగాన్ని భాజపా నాయకురాలు పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇవాళ విజయవాడకు చేరుకున్న నడ్డా.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ జగన్ పథకం కాదని, ప్రధాని నరేంద్ర మోదీదని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్‌తో రూ.5 లక్షల వరకు వైద్య సాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ పథకం దేశంలో ఎక్కడైనా పనిచేస్తుందని, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేయదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన మొదలు అన్ని పథకాల పేర్లు మార్చి.. సొంతవిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, జిల్లాల వారీగా రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, జరిగిన అభివృద్ధిపై పార్టీ ముద్రించిన పుస్తకాన్ని ఇంటింటికీ పంచి ప్రజల కోసం కేంద్రం ఏం చేసిందో వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయని నడ్డా విమర్శించారు. ‘మోదీ ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా కుటుంబ రాజకీయాలపై భాజపా పోరాడుతోంది. రాష్ట్రంలో తెదేపా, వైకాపావి కుటుంబ రాజకీయాలే. పంజాబ్, యూపీ, బిహార్, బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఓ కుటుంబానిదే. ఈ పార్టీల్లోకి మనవళ్లు, మనవరాళ్లు కూడా రావొచ్చు’ అని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత్ అంటే.. ప్రపంచం నుంచి తీసుకునేది కాదు, ఇచ్చేది. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో చర్చించి 23 వేల మంది పౌరులను క్షేమంగా భారత్కు తీసుకొచ్చాం. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా బయటపడేందుకు ఇతర దేశస్థులు భారత జెండాలు పట్టుకున్నారు. ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా దక్కుతున్న గౌరవానికి ఇదే నిదర్శనం. దేశంలోని అన్ని మతాల పుణ్యక్షేత్రాలనూ భాజపా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ఐదుగురు మహనీయుల స్మారకాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాన మోదీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని నడ్డా స్పష్టం చేశారు.
ఇప్పుడు స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్‌కు ఔషధాల ఆవిష్కరణకు 20 ఏళ్లు పట్టింది. పోలియోకు ఔషధం కనిపెట్టేందుకు 30 ఏళ్లు పట్టింది. కానీ.. కొవిడ్ టీకా మాత్రం ఏడాదిలో తీసుకురాగలిగాం. 200 కోట్ల టీకాలు వేగంగా పంపిణీ చేసిన దేశంగా రికార్డు సృష్టించనున్నాం. గత 8 ఏళ్లల్లో ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ 50 సార్లు పర్యటించారు. ఏ ప్రధాని కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్నిసార్లు పర్యటించలేదు.
కోర్ కమిటీ భేటీ లో —
ఏపీ పర్యటనలో ఉన్న జేపీ నడ్డాతో భాజపా రాష్ట్ర నేతల కోర్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పొత్తుల అంశంతోపాటు పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ పొత్తులపై రాష్ట్ర నేతలు మాట్లాడవద్దని సూచించారు. ఇతర పార్టీలకు దూరం అనే వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేశారు. పొత్తులపై మాట్లాడొద్దని అమిత్ షా చెప్పాకా ఆ ప్రస్తావన ఎందుకు వస్తోందనని ప్రశ్నించారు. పవన్ ఆప్షన్లపై పెద్దగా స్పందిచాల్సిన అవసరం లేదన్నారు. సీఎం అభ్యర్థిగా జనసేన నేతల డిమాండ్‌లపై స్పందించాల్సిన అవసరం లేదని నడ్డా సూచించారు. పవన్ తన ఆలోచనలు ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారని నడ్డా తెలిపారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీతో ఎలా వ్యవహరించాలనేది హైకమాండ్ పరిధిలోని అంశమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా నేతలకు సూచించారు. రాష్ట్రంపై భాజపాకు దృష్టి ఉందని, పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు. ఏపీని ఎలా డీల్ చేయాలో తెలియదనుకుంటున్నారా? అని నేతలను నడ్డా ప్రశ్నించినట్లు సమాచారం.
దేశంలో పేదరికం తగ్గింది’-
ప్రధాని మోదీ పరిపాలనా దక్షత వల్ల దేశంలో పేదరికం 22% నుంచి 10%కు తగ్గిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని తెలిపారు. 50 కోట్ల మంది భారతీయులకు రూ.10,500 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యబీమా లభించిందన్నారు.
ప్రధాని మోదీ పరిపాలనా దక్షత వల్ల దేశంలో పేదరికం 22% నుంచి 10%కు తగ్గిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ మేధావుల సభనుద్దేశించి మాట్లాడుతూ ఎగుమతులు రికార్డుస్థాయిలో పెరిగాయన్నారు. 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని తెలిపారు. 50 కోట్ల మంది భారతీయులకు రూ.10,500 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యబీమా లభించిందన్నారు. ఉక్రెయిన్ నుంచి 23వేల మందిని భద్రంగా భారతదేశానికి తెచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, సహ బాధ్యులు సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర నేతలు పాల్గొన్నారు. సమావేశాన్ని మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ ప్రారంభించారు. చివర్లో పద్మావతి అనే మోదీ అభిమాని బియ్యం గింజలతో రూపొందించిన ప్రధాని చిత్తరువును నడ్డాకు అందచేశారు.
నేడు రాజమహేంద్రవరంలో గోదావరి గర్జన సభ
రాజమహేంద్రవరం వేదికగా భాజపా గోదావరి గర్జన సభ జరగనుంది. ఈ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఉదయం పదకొండున్నరకు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం రానున్న నడ్డా.. విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా హోటల్ మంజీరా చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వపథకాల లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. అనంతరం సాయంత్రం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే గోదావరి గర్జనకు హాజరుకానున్న నడ్డా.. రాత్రి ఏడు గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుని దిల్లీ బయల్దేరి వెళ్తారు.