చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో డేటా చౌర్యానికి కుట్ర జరిగింది నిజమే అని శాసనసభ నియమించిన ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 2016-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద కుట్ర జరిగిందని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో డేటా చౌర్యం, పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై విచారణకు ఏర్పాటు చేసిన శాసనమండలి సబ్ కమిటీ సమావేశమైంది. చంద్రబాబు ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు అసెంబ్లీ హౌస్ కమిటీ నిర్ధారించిందన్నారు. హోం, ఐటీ శాఖల అధికారులతో నాలుగురోజుల పాటు చర్చించిన తర్వాత ఈ విషయం తెలిసిందన్నారు.
రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని భూమన విమర్శించారు. ఇది ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా మారిందని అన్నారు. డేటా చౌర్యం చేసి దాదాపు 40 లక్షల ఓట్లు తొలగించారని, అవి వైసీపీకి అనుకూల ఓట్లు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను మాత్రమే నిలుపుకుని.. వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలు ప్రయత్నించాయన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించి తప్పుడు మార్గంలో రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. సేవా మిత్ర యాప్ ద్వారానే డేటా చోరీ జరిగిందని తెలిపారు.
ఈ డేటా చౌర్యంలో ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అప్పట్లో డేటా చౌర్యం పై వైసీపీ రచ్చ చేయడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, అయితే అప్పట్లో సిట్ నామమాత్రంగా పనిచేసిందని ఆయన తెలిపారు. పెగాసస్, డాటా చౌర్యంపై హౌస్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సబ్‌కమిటీ సభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి, మద్దాల గిరి, మొండితోక జగన్మోహనరావు తదితరులు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణకు సిద్ధమా ? టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెగాసెస్ (Pegasus) ఇక్యూప్‌మెంట్ కొన్నారని అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పెగాసెస్ ఇక్యూప్‌మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్‌టీఐ సమాధానం ఇచ్చారని… కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు డేటా చౌర్యం చేశారని గతంలో అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగస్థులను వేధించారని ఆయన విమర్శించారు. పెగాసెస్‌పై పెద్ద సభా కమిటిని వేసి చర్చ నిర్వహించడం వృధాప్రాయాసే అయిందన్నారు. పెగాసెస్ మీద చర్చ జరగాలని శాసనసభలో వేస్ట్‌గా షార్ట్ డిస్కసన్ కూడా పెట్టారని అన్నారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ అభద్రతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్‌కు సిద్ధమా… మంత్రులు, ఎమ్మెల్యేలచే ఆరోపణలు చేయించడంకాదు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగలరా?… కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎంక్వైరీకి సిద్ధమా?’’ అంటూ పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు.