గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మపై దాడిని నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చలో కంతేరుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే చలో కంతేరు పిలుపు దృష్ట్యా గుంటూరు జిల్లాలోని తాడికొండ, కంతేరులో పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చలో కంతేరుకు వెళ్లకుండా తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబును పోలీసులు గృహ నిర్బంధించారు. ఆయనను బయటికి వెళ్లకుండా ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అలాగే గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ను తాడేపల్లిలో గృహ నిర్బంధించారు. గుంటూరులో కోవెలమూడి రవీంద్ర, డేగల ప్రభాకర్, తెదేపా నేత కనపర్తి శ్రీనివాస్ను పోలీసులు గృహనిర్బంధించారు.
చలో కంతేరు
వెంకాయమ్మపై దాడి నేపథ్యంలో.. చంద్రబాబు ఆమెను ఫోన్లో పరామర్శించారు. వైకాపా నేతల దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అనంతరం “చలో కంతేరు”కు చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో.. రేపు తెదేపా దళిత నేతలు గుంటూరు జిల్లా కంతేరు గ్రామానికి వెళ్లనున్నారు
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని కంతేరు గ్రామానికి చెందిన కె. వెంకాయమ్మకు నాలుగున్నర సెంట్ల స్థలం ఉంది. అందులో మూడున్నర సెంటు ఆక్రమణకు గురికాగా న్యాయం కోసం చాలాకాలంగా తహసిల్దార్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో మే 16న గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ పరిపాలనపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ‘‘జగన్ పాలన ఏడ్చినట్టు ఉంది. ఈ ప్రభుత్వంలో ఏ సమస్యా పరిష్కారం కావడం లేదు. ఈసారి చంద్రబాబే సీఎంగా గెలుస్తారు. కావాలంటే నాకున్న ఎకరన్నర పొలం పందెం పెడతాను’’ అంటూ ఆమె సవాలు చేశారు.
నిరుపేద దళిత కుటుంబానికి చెందిన తనకు జగన్ పింఛను కూడా కట్ చేశారని, కరెంటు బిల్లు రూ.18 వేలు వచ్చినట్టు చూపి పథకాలన్నీ రద్దు చేశారని ఆక్రోశించారు. వెంకాయమ్మకు డయాలసిస్, టీబీ సమస్యలు ఉన్నాయి. ఇంజక్షన్ తీసుకోవడానికి తన అన్న ఇంటికి వెళ్లింది. దీంతో వెంకాయమ్మ భయపడి ఇంటికి తాళం వేసి ఊరు వదలి ఎటో వెళ్లిపోయిందని ఆ గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు దుష్ప్రచారం చేశారు. ఆ విషయం తెలుసుకుని ఆమె రాత్రి పదిగంటల సమయంలో ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఒక పథకం ప్రకారం అక్కడకు పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆమెతో పెద్దపెద్దగా వాగ్వాదానికి దిగారు. ఇంట్లోకి చొరబడి వస్తువులు పగలగొట్టారు. దాడి చేసి గాయపరిచారు. దుర్భాషలాడుతూ..కాళ్లతో తంతూ..చీర కొంగుతో గొంతు నులుముతూ.. మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ‘‘నిన్ను చంపితేగాని జగన్ దగ్గర మాకు విలువ ఉండదు. నిన్ను చంపకుండా వదలం’’ అంటూ బెదిరించారు. తనకు ఆరోగ్యం సరిగా లేదన్నా వదిలిపెట్టలేదు. జగన్‌ను తిడతావా అంటూ చీరను చించేశారు. ‘‘ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయో… గ్రామంలో ఏ విధంగా నువ్వు ఉంటావో చూస్తాం’’ అని బెదిరించారు.
తాడికొండ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలన్నీ బాధితురాలు పేర్కొన్నారు. కాగా, దాడిచేసిన వైసీపీ కార్యకర్తలు వెంకాయమ్మపై తాడికొండ పోలీస్ స్టేషన్‌లో పోటీ ఫిర్యాదు చేశారు.నాకు రక్షణ కావాలని ఆ సందర్భంలో కోరిన బాధితురాలు‘‘రాష్ట్రంలో పాలన ఎలా ఉందో నిజం చెప్పినందుకు వైసీపీ నేతలు నాపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. నా జాకెట్టు చించారు. నేను డయాలసిస్ రోగిని. అయినా దయ చూపించకుండా కొట్టారు. నన్ను చంపేస్తామని, తిరగనివ్వబోమని హెచ్చరించారు. వారి నుంచి నాకు, నా కుమారుడికి రక్షణ కావాలి’’ అంటూ వెంకాయమ్మ విజ్ఞప్తి చేసింది. ఆమె ఆ సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్, పిల్లి మాణిక్యాలరావును కలిసి తనపై జరిగిన దాడిని వివరించారు. ప్రశ్నించిన వారిని ఎవరినీ వైసీపీ నేతలు బతకనీయడం లేదని, దుర్మార్గంగా దాడి చేసి కొడుతున్నారని శ్రావణ్ ఆరోపించారు. ఆమెపై దాడి చేసిన వారిని తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ఒంటరి దళిత మహిళపై దాడిచేసి కొట్టడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. వెంకాయమ్మపై జరిగిన దాడిని మహిళా కమిషన్ పరిగణనలోకి తీసుకొని, చర్యలు తీసుకోవాలని పిల్లి మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సందర్భంలో.. దళిత మహిళ వెంకాయమ్మకు వైసీపీ మూకల నుంచి రక్షణ కల్పించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గుంటూరు ఎస్పీకి లేఖ కూడా రాశారు. తన అసమ్మతిని తెలిపిందనే అక్కసుతో ఆమె ఇంటిని వైసీపీ వారు ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వెంకాయమ్మ కుటుంబంపై దాడిని ఖండించిన చంద్రబాబు
వెంకాయమ్మ కుటుంబంపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. సీఎం జగన్ పాలనను విమర్శిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. గతంలో కూడా వెంకాయమ్మపై వైసీపీ వర్గీయులు దాడి చేశారని, ఇప్పుడు ఆమె కొడుకుపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. దళిత మహిళపై దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక కుటుంబంపై అరాచక శక్తులు పదే పదే దాడులు చేస్తుంటే.. అడ్డుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని నిలదీశారు. దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కంతేరు వాసి వెంకాయమ్మకు టీడీపీ అధినేత చంద్రబాబు పోన్ చేశారు. వెంకాయమ్మను ఆయన ఫోన్‌లో పరామర్శించారు. వైసీపీ నేతల దాడి ఘటన నేపథ్యంలో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలన్న వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు.
వారి కుటుంబానికి రక్షణ కల్పించా కల్పించాలి : అచ్చెన్నాయుడు
వైసీపీ పాలనలో ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వెంకాయమ్మ కుటుంబంపై వైసీపీ మూకల దాడిని ఖండిస్తున్నామన్నారు. వైసీపీ పాలనను ప్రశ్నించినందుకు వెంకాయమ్మను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకాయమ్మ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.