గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి మోదీ చాపర్ వెళుతుండగా నల్ల బెలూన్లను కాంగ్రెస్ నేతలు ఎగురవేశారు. దీంతో సెక్యూరిటీ పరంగా సీరియస్‌గా పోలీసులు తీసుకున్నారు. గాల్లో బెలూన్స్ ఎగరవేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరు బెలూన్స్ వదిలారన్నదానిపై దర్యాప్తు ప్రారంభించారు. చాపర్‌కు దగ్గరగా బ్లాక్ బెలూన్స్ వెళ్లినట్లు గుర్తించారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో నల్ల బెలున్లతో కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. ప్రధాని మోదీ జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది శూన్యమంటూ ఆరోపించారు. మోదీ పర్యటనకు నల్ల బెలూన్లతో వెళుతుండగా జెట్టి గురునాథ్ రావును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. ఆపై హౌస్ అరెస్ట్ చేశారు.
శైలజనాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన : అరెస్ట్
రాజమండ్రి : రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ చలో భీమవరం పిలుపుతో శైలజానాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు మోదీ గోబ్యాక్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్తున్న వారిని జాంపేట గాంధీ బొమ్మసెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శైలజానాధ్ సహా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏపి విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర ఆందోళన
ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయం సమీప ప్రాంతం నుండి కొన్ని దుష్ట శక్తులు ప్రమాదకర బెలూన్లు ఎగరవేయడం పట్ల రాష్ట్ర బీజేపీ చీఫ్ శ్రీ సోము వీర్రాజు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన కోసం ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుని, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర సీఎం కలసి ఒకే హెలికాప్టర్ లో భీమవరం బయలుదేరిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నల్ల బెలూన్లు ఎగరవేయడం ద్వారా “భారీ కుట్రకు” పాల్పడిన సంఘటనపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బిజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ సంఘటన వెనుక సూత్రధారులు పాత్రధారులు కుట్ర అమలు చేసిన దుష్టశ్తులను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన పై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనన్నట్లు సోము వీర్రాజు తెలిపారు.