సాధారణంగా లాంగ్వేజ్ పండిట్ ప్రవేశ పరీక్ష (ఎల్‌పీ సెట్) నిర్వహించిన తర్వాత రెండు నెలల్లో ఫలితాలు విడుదల చేస్తారు. ఆ తర్వాత రెండు నెలల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అయితే గత సెప్టెంబరులో లాంగ్వేజ్ పండిట్-2021 పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రవేశాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. హిందీ పండిట్లకు 1381 మంది, తెలుగు పండిట్లకు 705 మంది పరీక్ష రాశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఫలితాలను విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులకు ఇప్పటి వరకు ప్రవేశాల కౌన్సెలింగ్ మాత్రం నిర్వహించలేదు. పరీక్షల విభాగం దాని ఊసే ఎత్తడం లేదు. నెలల తరబడి కౌన్సెలింగ్ నిర్వహించకపోడంతో అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎల్‌పీ సెట్-2022 నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ జారీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో శిక్షణ ఇవ్వడానికి తెలుగు పండిట్లకు 35, హిందీ పండిట్లకు 47 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. తెలుగు పండిట్ శిక్షణ కోసం ప్రైవేటు కాలేజీలతో పాటు రాజమహేంద్రవరం, కర్నూలులో ప్రభుత్వ బీఈడీ కళాశాలలు, కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా సెక్షన్లు కేటాయించారు. తెలుగు, హిందీ పండిట్ల కోసం సుమారు నాలుగు వేల సీట్లు ఉన్నాయి. గతంలో పండిట్ శిక్షణకు పోటీ ఎక్కువగా ఉండేది. పండిట్ శిక్షణ లేకపోయినా తెలుగు సబ్జెక్టుతో బీఎ చేసి బీఈడీలో తెలుగు మెథడాలజీ చేసినా గ్రేడ్-2 పండిట్‌కు అర్హత కల్పించడం, హిందీ విషయంలో పోస్టుల సంఖ్య తగ్గిపోవడంతో డిమాండ్ పడిపోయింది. అయినా విద్యార్థులకు తెలుగు, హిందీపై అవగాహన, పరిజ్ఞానం, ప్రవేశం ఉండాలంటే పండిట్ల అవసరం ఉంది.
ప్రశ్నార్థకంగా పండిట్ కోర్సుల ఉనికి!
ప్రభుత్వ విధానాల వల్ల పండిట్ పోస్టులకు దశలవారీగా మంగళం పాడుతారనే వాదన ఉంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు దశలవారీగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిది వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమమే అమలు చేస్తున్నారు. మరో రెండేళ్ల తర్వాత అంటే.. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం అనేది ఉండదని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో తెలుగుతో పాటు హిందీ పండిట్ పోస్టులకు ప్రాధాన్యం తగ్గనున్నందున భవిష్యత్తులో పండిట్ శిక్షణ కళాశాలల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని పండిట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.