నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రశాంతంగా ముగిసింది. ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరేంధిరప్రసాద్ నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల సమక్షంలో అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో వివిధ కారణాలతో 13 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించగా, 15 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. నామినేషన్ల పరిశీలనను ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సురేష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ పరిశీలనలో ఆత్మకూరు ఇన్చార్జి ఆర్డిఓ బాపిరెడ్డి ఉన్నారు. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
నామినేషన్లు ఆమోదించిన అభ్యర్థుల వివరాలు
1). మేకపాటి విక్రమ్ రెడ్డి – వైయస్సార్సిపి
2). గుండ్లపల్లి భరత్ కుమార్ – బిజెపి
3). నందా ఓబులేసు – బి.ఎస్.పి
4). షేక్ జలీల్ – నవరంగ్ కాంగ్రెస్ పార్టీ
5). షేక్ మొయినుద్దీన్ – ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
6). బండారు రవి – హర్దామ్ మన్వట్వాడి రాష్ట్రీయ దళ్
7). బొర్రా సుబ్బారెడ్డి – ఇండిపెండెంట్
8). బూరగ రత్నం – ఇండిపెండెంట్
9). చల్లా పెంచల మోహన్ – ఇండిపెండెంట్
10). పెనాక అమర్నాథ్ రెడ్డి – ఇండిపెండెంట్
11). పెయ్యల హజరతయ్య – జనం మనం పార్టీ
12). రావులకొల్లు మాలకొండయ్య – ఇండిపెండెంట్
13). షేక్ మహబూబ్ బాషా – అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
14). తూమాటి శశిధర్ రెడ్డి – ఇండిపెండెంట్
15). లాలి వెంకటయ్య – ఇండిపెండెంట్
28 మంది నామినేషన్లు వస్తే.. అటుఇటుగా సగం నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఏదో పేరు కోసం నామినేషన్లు వేయడం, ఫార్మాట్ కూడా అర్థం చేసుకోలేకపోవడం, ఆ ఫామ్ ఫిలప్ చేయడానికి గైడెన్స్ లేని నామినేషన్లు, అడ్రస్ లేని పార్టీల నేతల నామినేషన్లు స్క్రూటినీ దశలోనే తిరస్కరణకు గురయినట్టుగా ఉన్నాయి. మిగిలింది 15 నామినేషన్లు. అయితే ఇంకా ఉపసంహరణకు అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. 15 నామినేషన్లు ఉన్న నేపథ్యంలో వీటిలో కొన్ని ఉపంహరణకు గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండిపెండెంట్, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థుల్లో ఎంతమంది బరిలోకి నిలుస్తారనేది సందేహమే.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఆత్మకూరు ఉపఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూరంగా ఉండటంతో పోటీ ప్రధానంగా వైసీపీ, బీజేపీల మధ్యే ఉండనుంది. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలోకి ఉండగా బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరులో ప్రధానంగా వైసీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో దూరంగా ఉన్నాయి. తొలుత వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ భావించింది. కానీ ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో వ్యూహం మార్చింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ల పర్వం ముగియగానే మందీమార్భలంతో మోహరించింది.
మండలానికి ఒక మంత్రిని, ఓ ఎమ్మెల్యేను ఇన్‌చార్జులుగా నియమించారు. వారంతా ఈ నెల 10వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వీరు ఇక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొనేలా వ్యూహం రూపొందించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ప్రజావ్యతిరేకత పొడ చూపింది.
దీంతో అత్యధిక మెజారిటీ సాధించి ప్రజావ్యతిరేకత లేదని నిరూపించుకోవడానికి వైసీపీ అగ్రనేతలు తపన పడుతున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నామినేషన్లు ముగిసిన తర్వాత ఆత్మకూరు శ్రీధర్ గార్డెన్స్‌లో నియోజకర్గ ఎన్నికల ఇన్‌చార్జి బాలినేని, జిల్లా మంత్రి కాకాణి అన్ని మండలాల ముఖ్యనేతలు, వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. ప్రచార వ్యూహాలపై చర్చించారు.
వైసీపీ ఇంఛార్జిల నియామకం
మరోవైపు ఆత్మకూరు ఉపఎన్నిక కోసం వైసీపీ అధిష్టానం ప్రతి మండలానికి ఇంచార్జీల ప్రకటించింది. ఏఎంఎస్ పేట మండలానికి మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆత్మకూరు రూరల్ మండలానికి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతసాగరం మండలానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చేజర్ల మండలానికి మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, ఆత్మకూరు పట్టణానికి మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి, మర్రిపాడు మండలానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సంగం మండలానికి మంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని ఇన్‌ఛార్జులుగా నియమించింది.